ఇటీవలే కపిల్ దేవ్ నాయకత్నంలోని క్రికెట్ సలహా కమిటీ టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో హెడ్ కోచ్‌గా రవిశాస్త్రికి బీసీసీఐ మరో రెండేళ్లు పొడిగింపు ఇచ్చింది. కొత్త ఒప్పందం ప్రకారం రవిశాస్త్రికి సుమారు 20 శాతం మేర జీతం పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వేతనం ఏడాదికి సుమారు రూ. 9.5 నుంచి రూ.10 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రవిశాస్త్రి బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.8 కోట్ల వేతనం తీసుకుంటున్నాడు.
కొత్త ఒప్పందం ప్రకారం టీమిండియా సహాయక సిబ్బంది వేతనాలు కూడా భారీగా పెరగనున్నాయి. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌కు రూ.3.5 కోట్లు, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌కు రూ.3 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కోచ్‌గా ఎంపికైన తర్వాత శాస్త్రి మాట్లాడుతూ ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్, 2020లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌లపై దృష్టి సారించినట్లు చెప్పాడు.
ఈ సందర్భంగా శాస్త్రి మాట్లాడుతూ “వచ్చే రెండేళ్లలో రెండు ఐసీసీ టోర్నమెంట్‌లు ఉన్నాయి. 2021లో టీ20 వరల్డ్‌కప్ జరుగనుంది. ఇప్పటికే టెస్టు చాంపియన్‌షిప్ కూడా మొదలైంది. ప్రస్తుతం ఈ రెండింటికే తొలి ప్రాధాన్యత ఉంటుంది. వాటికి అనుగుణంగా సన్నద్ధం కావడమే నా ముందున్న లక్ష్యం. మాకు అద్భుత టెస్ట్ జట్టు ఉంది” అని అన్నాడు. “ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాం కాబట్టి దానిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆటగాళ్ల అద్భుతమైన ప్రతిభను బయటకు తీయాలి. టెస్టు, వన్డే, టీ20 జట్లలోకి చాలామంది యువకులు వస్తున్నారు. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచే జట్టును రూపొందించడమే నా పని” అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.