అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో మంది ‘బ్రదర్స్’ ఒకే జట్టుకు కలిసి ఆడారు. ఆస్ట్రేలియాకు వా బ్రదర్స్, జింబాబ్వేకు ఫ్లవర్ బ్రదర్స్, ఇంగ్లండ్‌కు హోలియేక్ బ్రదర్స్ ఆడారు. మన భారత జట్టులోనూ అన్నదమ్ములు ఒకేసారి ఆడిన సందర్భాలు ఉన్నాయి. మొహిందర్, సురిందర్ అమర్‌నాథ్ బ్రదర్స్.. ఇర్ఫాన్, యూసఫ్ పఠాన్ బ్రదర్స్.. హార్ధిక్, కృనాల్ పాండ్యా బ్రదర్స్ భారత జట్టు తరఫున బరిలోకి దిగి సత్తా చాటారు. ఇప్పుడు మరో అన్నదమ్ముల జోడీ జాతీయ జట్టుకు ఎంపికైంది.
వెస్టిండీస్ పర్యటనకు భారత జట్లను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. టీ20 సిరీస్‌కు సోదరులైన రాహుల్ చాహర్, దీపక్ చాహర్‌ను ఎంపిక చేశారు. రాహుల్, దీపక్ క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. ఐపీఎల్‌లో 19 ఏళ్ల రాహుల్ చాహర్ ముంబయి ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. గత సీజన్‌లో 13 వికెట్ల పడగొట్టి అందరి ప్రశంసలు పొందిన ఈ యువస్పిన్నర్ ఎంతో పొదుపుగా బౌలింగ్ చేయగలడు. రాహుల్ చాహర్ అన్నయ్య దీపక్ చాహర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలకమైన ఆటగాడు. తన పేస్‌తో జట్టుకు ఎన్నోవిజయాలను అందించాడు. ఇప్పుడు ఈ అన్నదమ్ములు కలిసి భారత్ తరపున ఆడనున్నారు.