
PV Sindhu Sports Academy: తెలుగు నేల ఇచ్చిన అపూర్వ క్రీడారత్నం పీవీ సింధు తన జీవితకాల స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సాగర తీర నగరం విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ‘పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ అకాడమీ శంకుస్థాపన మహోత్సవం నేడు ఘనంగా జరిగింది. పి.వి. సింధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారా భావి తరాల క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చిన్నతనం నుంచి తాను సాగించిన క్రీడా ప్రయాణం, కోచ్‌లు అందించిన ప్రోత్సాహం, ఎదురైన సవాళ్లను మనసులో ఉంచుకుని ఈ కేంద్రానికి సింధు శ్రీకారం చుట్టారు. ఈ అకాడమీ శంకుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖలోని తోటగురువు ప్రాంతంలో ” పీవీ సింధు సెంటర్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఎక్సలెన్స్ అకాడమీ” కి మంత్రి నారాలోకేష్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పీవీ సింధు దంపతులతో పాటు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
విశాఖపట్నంలో రూపుదిద్దుకుంటున్న ఈ అంతర్జాతీయ క్రీడా సంస్థ వెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు ఎంతో కీలక పాత్ర పోషించాయి. ప్రారంభంలో కేవలం బ్యాడ్మింటన్ అకాడమీగా మాత్రమే దీనిని భావించినప్పటికీ, చంద్రబాబు ఇచ్చిన సలహాలతో ఈ ప్రాజెక్ట్ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. ఒకే క్రీడకు పరిమితం కాకుండా ఏకంగా 9 రకాల క్రీడా విభాగాలకు శిక్షణ ఇచ్చేలా దీని విస్తరణ జరిగింది. “ఒలింపిక్ పతకాలు ఒక తరానికి మాత్రమే స్ఫూర్తినిస్తాయి, కానీ క్రీడా సంస్థలు తరతరాలను తయారు చేస్తాయి” అని సింధు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భారత్‌లో ప్రతిభకు ఏమాత్రం కొదవ లేదని, సరైన వేదికలు కల్పిస్తే ప్రపంచ స్థాయి ఛాంపియన్లు వెలుగులోకి వస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ క్రీడా రంగానికి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. “మీకు ఏ సహాయం కావాలన్నా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని సింధుకు కొండంత భరోసా ఇచ్చారు. విశాఖపట్నాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా మార్చే దిశగా వేస్తున్న ఈ అడుగుకు ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు, సదుపాయాలు కావాలన్నా తక్షణమే అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి, యువతకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా సంస్థల నుంచి స్ఫూర్తి పొంది ఈ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారు. వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో సింధు స్పోర్ట్స్ సెంటర్ నిర్మాణం సాగుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా ఇండోర్ 25 మీటర్ల షూటింగ్ రేంజ్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా, పారిస్ 2024 ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ పూల్ నిర్మించిన ఇటలీకి చెందిన ప్రముఖ సంస్థతోనే విశాఖలోనూ ఇటలీ ఒలింపిక్ ప్రమాణాల స్విమ్మింగ్ పూల్‌ను నిర్మిస్తుండడం విశేషం. బ్యాడ్మింటన్ హాల్‌లో గాలి ప్రవాహం వల్ల షటిల్ దిశ మారకుండా అంతర్జాతీయ మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ఎయిర్ సర్క్యులేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
క్రీడాకారులకు కేవలం ఆటలోనే కాకుండా అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కోచింగ్, గాయాల నుంచి త్వరగా కోలుకునేలా రికవరీ సిస్టమ్స్, పౌష్టికాహారానికి సంబంధించి న్యూట్రిషన్, విద్యాబోధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. అథ్లెట్లు మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యేలా సకల వసతులు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి రానున్నాయి. తరతరాల క్రీడాకారులను తీర్చిదిద్దే అత్యుత్తమ కేంద్రంగా ఈ సంస్థ నిలవబోతోంది. విశాఖ వేదికగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రపంచ స్థాయి సెంటర్ రాబోయే రోజుల్లో దేశానికి ఎంతోమంది ఒలింపియన్లను అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
విశాఖ వేదికగా పీవీ సింధు ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఈ గ్లోబల్ స్పోర్ట్స్ సెంటర్ తెలుగు రాష్ట్రాల క్రీడా చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పూర్తి సహకారంతో, అత్యాధునిక సాంకేతికతతో సిద్ధమవుతున్న ఈ సంస్థ భారత్ నుంచి భవిష్యత్తు ఒలింపిక్ ఛాంపియన్లను తయారుచేసే దివ్యధామంగా మారనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..