
Khelo India Dialogue: దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక సందేశం అందించారు. జాతీయ క్రీడా దినోత్సవం-2026 వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా డైలాగ్’ కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘మేరా యువ భారత్’ (MY Bharat) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో రెండు కళాశాలల నుంచి యువత ఇందులో పాల్గొననుంది. క్రీడలతో పాటు యువ నాయకత్వం, పౌర బాధ్యత, స్వచ్ఛంద సేవ, ఆరోగ్యం, దేశ నిర్మాణం వంటి అంశాలపై చర్చకు ఈ వేదిక అవకాశం కల్పించనుంది.
దేశ క్రీడా ప్రస్థానంలో యువతను మరింత భాగస్వాములను చేయడం, వారి ఆలోచనలు, ఆకాంక్షలను తెలుసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. యువత నేతృత్వంలో వికసిత భారత్ నిర్మాణానికి అవసరమైన ఆలోచనలను వెలికితీయడంపైనా దృష్టి పెట్టనున్నారు.
ప్రధాని ప్రసంగం తర్వాత స్థానిక స్థాయిలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యువ పాల్గొనేవారు, ‘మై భారత్’ వాలంటీర్లు, స్థానిక క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.
క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు ప్రముఖ భారతీయ క్రీడాకారులు, పతక విజేతలతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమంలోని ప్రత్యేకత. ‘యువ సమ్వాద్’లో భాగంగా యువత తమ ఆలోచనలు, అభిప్రాయాలు, భవిష్యత్తు లక్ష్యాలను పంచుకోనున్నారు.
‘ఖేలో ఇండియా డైలాగ్’లో ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టి సారించనున్నారు.
1. క్రీడా వ్యవస్థకు మరింత బలం: మెరుగైన క్రీడా మైదానాలు, శిక్షణ సదుపాయాలు, క్రీడా విజ్ఞానం, అందరికీ సమాన అవకాశాల ద్వారా దేశ క్రీడా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంపై చర్చించనున్నారు.
2. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రతిభకు పదును: క్రీడా ప్రతిభను శాస్త్రీయంగా గుర్తించడం, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత, దీర్ఘకాలిక శిక్షణ ద్వారా 2036 ఒలింపిక్స్‌కు అవసరమైన క్రీడాకారులను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టనున్నారు.
3. యువ నాయకత్వానికి ప్రోత్సాహం: పరిపాలనా వేదికలు, ‘మై భారత్’ ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించే అంశంపై చర్చ జరగనుంది.
4. వికసిత భారత్‌లో యువత పాత్ర: పౌర బాధ్యత, భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలు, వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవ ద్వారా దేశ నిర్మాణంలో యువతను మరింత క్రియాశీలకంగా భాగస్వాములను చేయడంపై చర్చించనున్నారు.
5. మాదకద్రవ్య రహిత యువత: క్రీడలు, యువజన నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుని మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన పెంచే ‘నషా ముక్త యువ’ ఉద్యమానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఈ ఉద్యమాన్ని మరింత విస్తరించనున్నారు.
యువతలో ఆరోగ్యం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు.. దేశ అభివృద్ధి కార్యక్రమాల్లో వారి ఆలోచనలు, భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో ‘ఖేలో ఇండియా డైలాగ్’ నిర్వహిస్తున్నారు. క్రీడలను యువ నాయకత్వం, సామాజిక బాధ్యత, దేశ నిర్మాణంతో అనుసంధానించే వేదికగా ఈ కార్యక్రమం నిలవనుంది.
మొత్తంగా.. క్రీడల్లో భారత్ భవిష్యత్తు, 2036 ఒలింపిక్స్ లక్ష్యం, యువ నాయకత్వం, వికసిత భారత్, మాదకద్రవ్య రహిత సమాజం వంటి కీలక అంశాలపై యువతతో ప్రధాని మోదీ సంభాషించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..