Paralympics 2024: ముగిసిన పారాలింపిక్స్.. 7 స్వర్ణాలతో సహా 29 పతకాలతో కొత్త బెంచ్ మార్క్ నెలకొల్పిన భారత క్రీడాకారులు

|

Sep 09, 2024 | 7:40 AM

పారిస్ పారాలింపిక్స్‌లో భారతదేశం ప్రయాణం పూర్తి చేసుకుని చివరికి పారిస్ పారాలింపిక్స్ లో మొత్తం 29 పతకాలను సాదించింది. వీటిల్లో 7 బంగారు పతకాలు ఉన్నాయి. పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇదే అత్యధిక పతకాలు. ఈ క్రమంలో తొలిసారిగా ఆర్చరీలో బంగారు పతకం సాధించగా అథ్లెటిక్స్‌లో అత్యధికంగా 17 పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. సెప్టెంబరు 8 పారిస్‌లో జరిగిన పారాలింపిక్ క్రీడలకు చివరి రోజు.. అయితే చివరి రోజు భారతదేశం నుండి ఒక అథ్లెట్ మాత్రమే పోటీ పడింది.

Paralympics 2024: ముగిసిన పారాలింపిక్స్.. 7 స్వర్ణాలతో సహా 29 పతకాలతో కొత్త బెంచ్ మార్క్ నెలకొల్పిన భారత క్రీడాకారులు
Paris Paralympics 2024
Image Credit source: AFP/PTI
Follow us on

పారిస్ పారాలింపిక్ గేమ్స్ 2024 విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో పాల్గొన్న భారతదేశం జర్నీ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. క్రీడల్లో చివరి రోజున, భారతదేశం ఒక్క ఈవెంట్‌లో మాత్రమే పోటీపడింది.. అయితే అందులో పతకం గెలవలేదు. ఈ ఈవెంట్ తో పారాలింపిక్‌ క్రీడలు కూడా ముగిశాయి. భారత్ క్రీడాకారులు భారత్‌ తరఫున అత్యంత విజయవంతమైన ప్రదర్శన ఇచ్చారు. పోటీల్లో చివరి రోజు పూజా ఓజా 200 మీటర్ల కెనోయింగ్‌లో పోటీపడింది. అయితే ఆమె నాల్గవ స్థానంలో నిలిచి పతక అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. ఈ విధంగా పారిస్ పారాలింపిక్స్‌లో భారతదేశం ప్రయాణం పూర్తి చేసుకుని చివరికి పారిస్ పారాలింపిక్స్ లో మొత్తం 29 పతకాలను సాదించింది. వీటిల్లో 7 బంగారు పతకాలు ఉన్నాయి. పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇదే అత్యధిక పతకాలు. ఈ క్రమంలో తొలిసారిగా ఆర్చరీలో బంగారు పతకం సాధించగా అథ్లెటిక్స్‌లో అత్యధికంగా 17 పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు.

సెప్టెంబరు 8 పారిస్‌లో జరిగిన పారాలింపిక్ క్రీడలకు చివరి రోజు.. అయితే చివరి రోజు భారతదేశం నుండి ఒక అథ్లెట్ మాత్రమే పోటీ పడింది. మహిళల 200 మీటర్ల KL1 కేటగిరీ కానో స్ప్రింట్‌లో.. పూజా ఓజా పాల్గొంది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ఐదుగురిలో పూజ నాలుగో స్థానంలో నిలిచింది. ఆమె తన రేసును 1:27.23 నిమిషాల్లో పూర్తి చేయగా.. మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించిన ఇటాలియన్ అథ్లెట్ 1:04.03 నిమిషాల్లో రేసును పూర్తి చేసింది. కెనడా క్రీడాకారిణి (57.00 సెకన్లు)కి స్వర్ణ పతకం, చైనాకు (57.26 సెకన్లు) రజత పతకం దక్కింది.

ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో పతకాలు సాధించిన ఆటలు

దీంతో భారతదేశం పతకాల సంఖ్య 29కి పరిమితం అయింది. అయితే ఇది దేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన పారాలింపిక్ క్రీడలుగా నిలిచిపోతాయి. అంతకుముందు టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ మొత్తం 19 పతకాలు సాధించగా.. అది అప్పటి అత్యంత అద్భుత ప్రదర్శన. ఈసారి క్రీడల ప్రారంభానికి ముందు 25 పతకాల లక్ష్యం నిర్దేశించగా.. భారత పోరాట పారా అథ్లెట్లు ఈ లక్ష్యాన్ని సాధించడమే కాకుండా ముందుకు సాగి టోక్యో కంటే 10 పతకాలు ఎక్కువగా సాధించారు. మూడు రకాల పతకాల సంఖ్య పెరగడం విశేషం. టోక్యోలో 5 స్వర్ణాలు మాత్రమే సాధించగా, ఈసారి 7 పసిడి పతకాలను భారత అథ్లెట్లు సాధించారు. అదేవిధంగా టోక్యోలో 8 రజతాలకు బదులుగా.. పారిస్‌లో 9 రజతాలు.. 5 కాంస్యాలతో పోలిస్తే ఈసారి 13 కాంస్యాలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

తమదైన ముద్ర వేసిన క్రీడాకారులు

వీరిలో టోక్యోలో స్వర్ణం గెలిచి పారిస్‌లో టైటిల్‌ను కాపాడుకున్న ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు. మహిళల స్టాండింగ్ రైఫిల్ షూటింగ్‌లో అవ్నీ లేఖరా మళ్లీ స్వర్ణం సాధించింది. జావెలిన్ త్రో స్టార్ సుమిత్ యాంటిల్ కూడా టోక్యో తర్వాత పారిస్‌లో స్వర్ణం సాధించాడు. ఈసారి పారాలింపిక్ రికార్డుతో ఈ విజయాన్ని సాధించాడు. హర్విందర్ సింగ్ ఆర్చరీలో భారతదేశానికి మొదటి సారి పారాలింపిక్ బంగారు పతకాన్ని అందించాడు. అదేవిధంగా క్లబ్ త్రోలో కూడా ధరంబీర్ భారత్‌కు తొలిసారిగా బంగారు పతకాన్ని అందించాడు. నవదీప్ సింగ్ తన జావెలిన్ త్రో రెండో విభాగంలో కూడా స్వర్ణం సాధించగా, పారా బ్యాడ్మింటన్‌లో నితీష్ కుమార్ స్వర్ణం, హైజంప్‌లో ప్రవీణ్ కుమార్ స్వర్ణం సాధించారు. అదే సమయంలో 17 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి చేతులు లేకుండా ఖచ్చితమైన లక్ష్యాలను చేధించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మిక్స్‌డ్‌ టీమ్‌లో రాకేశ్‌ కుమార్‌తో కలిసి కాంస్యం సాధించింది.

అథ్లెటిక్స్‌లో రికార్డు బద్దలు కొట్టిన పతకం

ఇది మాత్రమే కాదు అథ్లెటిక్స్ నుండి మొత్తం 17 పతకాలు దక్కాయి. ఇది మునుపటి ఆటలలో అన్ని క్రీడలలో సాధించిన 19 పతకాల కంటే 2 మాత్రమే తక్కువ. ఈసారి కొన్ని కొత్త ఈవెంట్లలో దేశానికి పతకాలు కూడా వచ్చాయి. కపిల్ పర్మార్ జూడోలో కాంస్య పతకాన్ని సాధించి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు. హర్విందర్ విలువిద్యలో సాధించిన స్వర్ణం చారిత్రాత్మకంగా మిగిలిపోనుంది. కాగా స్ప్రింటర్ ప్రీతి పాల్ రెండు వేర్వేరు ఈవెంట్లలో పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. మహిళల 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాలు సాదించారు. మొత్తంమీద భారతదేశం 29 పతకాలతో 18వ స్థానంలో నిలిచి టాప్ 20లో చోటు దక్కించుకుంది. టోక్యోలో భారత్ 24వ స్థానంలో నిలిచింది.

 

మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..