Pakistan: ప్రపంచ క్రికెట్‌ మనుగడను దెబ్బ తీసిన పాక్.. ఒక్క నిర్ణయంతో రచ్చ, రచ్చ..?

భారత్ వర్సెస్ పాకిస్థాన్ ఇప్పుడు కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు. ఇది ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్లను నడిపించే ఎకానమీ ఇంజిన్. దీని నుంచి తప్పుకోవడం అంటే కేవలం ఒక ప్రపంచకప్‌ను దెబ్బతీయడం మాత్రమే కాదు, అది బ్రాడ్‌కాస్టర్లు, ఐసీసీ, స్పాన్సర్లు, అభిమానులలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ మ్యాచ్‌ను వదులుకోవడం వల్ల పాకిస్థాన్‌కు కలిగే నష్టం, ప్రపంచకప్ పాయింట్ల పట్టికను పట్టించుకోకపోనా.. చాలా కాలం వరకు వెంటాడుతూనే ఉంటుంది.

Pakistan: ప్రపంచ క్రికెట్‌ మనుగడను దెబ్బ తీసిన పాక్.. ఒక్క నిర్ణయంతో రచ్చ, రచ్చ..?
Pakistan T20 World Cup 2026 Squad

Updated on: Feb 03, 2026 | 1:30 PM

Pakistan: ఆధునిక క్రికెట్ ఆర్థిక వ్యవస్థలో, కొన్ని మ్యాచ్‌లు ట్రోఫీల కంటే చాలా పెద్దవిగా మారుతుంటాయి. వాటిలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అగ్రస్థానంలో ఉంటుంది. కేవలం షెడ్యూల్‌లో ఉండే ఒక మ్యాచ్ మాత్రమే కాదు ఐసీసీకి బంగారు నిధి. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయమే టోర్నమెంట్‌కు వెన్నుముకగా నిలుస్తుంది. బ్రాడ్‌కాస్ట్ (ప్రసార) విలువను పెంచడమేకాక, సొంతంగా ఆదాయాన్ని సంపాదించలేని ఇతర క్రికెట్ బోర్డులకు పరోక్షంగా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రభుత్వం తమ జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనడానికి అనుమతినిస్తూ, భారత్‌తో మ్యాచ్‌కు మాత్రం నిరాకరించడంతో, ఐసీసీ (ICC) విడుదల చేసిన పత్రికా ప్రకటన ఒక హెచ్చరికలా వచ్చి పడింది. “పీసీబీ (PCB) తన దేశంలోని క్రికెట్‌పై పడే దీర్ఘకాలిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటుందని ఐసీసీ ఆశిస్తోంది. ఎందుకంటే, ఇది ప్రపంచ క్రికెట్ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది, ఇందులో పాకిస్థాన్ కూడా ఒక సభ్య దేశం, లబ్ధిదారు కూడా అని పేర్కొంది.”

దీని అర్థం క్రికెట్ ఆర్థిక భాషలో స్పష్టంగా చెప్పాలంటే.. ఇది కేవలం రాజకీయాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు – ఇది డబ్బుకు సంబంధించిన విషయం, అది కూడా భారీ మొత్తంలో ఉండడంతో ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది.

రూ. 45,000 కోట్ల ఆట..

భారత్-పాకిస్థాన్ టీ20 పోటీ విలువను ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, టికెటింగ్ తోపాటు ఇతర వాణిజ్య కార్యకలాపాలను కలిపి లెక్కగడితే సుమారు 500 మిలియన్ డాలర్లు (రూ. 45,000 కోట్లు) ఉంటుందని అంచనా. ప్రపంచంలో మరే ఇతర క్రికెట్ మ్యాచ్ కూడా దీనికి దరిదాపుల్లో ఉండదు.

బ్రాడ్‌కాస్టర్లకు ఇది ఒక ఆభరణం లాంటిది. భారత్ – పాకిస్థాన్ టీ20 మ్యాచ్‌లో కేవలం 10 సెకన్ల ప్రకటన రేటు రూ. 25-40 లక్షల వరకు ఉంటుంది. ఇతర అగ్రశ్రేణి జట్లతో భారత్ ఆడే నాకౌట్ మ్యాచ్‌ల కంటే కూడా ఇది చాలా ఎక్కువ. ఈ మ్యాచ్‌ను తొలగిస్తే, టోర్నమెంట్ ఆర్థిక నిర్మాణమే తలకిందులవుతుంది.

నష్టపోయేది ఎవరు? ఎంత?

బ్రాడ్‌కాస్టర్ (ప్రసారకర్త): తక్షణ ప్రభావం ప్రసార హక్కులు కలిగిన వారిపై పడుతుంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ద్వారా కేవలం ప్రకటనల ఆదాయమే రూ. 300 కోట్లు వస్తుందని అంచనా. బ్రాడ్‌కాస్టర్లు భారీ లాభాల కోసం పెట్టుబడి పెడతారు. మధ్యలో ఇలాంటి భారీ మ్యాచ్ రద్దు కావడం అంటే అది కేవలం షెడ్యూల్ సమస్య మాత్రమే కాదు – అది వారి పెట్టుబడి విలువకు కలిగే నష్టం. ఇప్పటికే ఆర్థిక నష్టాల కారణంగా జియోస్టార్ (JioStar) ఐసీసీ నుంచి రాయితీని కోరింది, ఈ పరిణామం వారి వాదనను మరింత బలోపేతం చేస్తుంది. ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్ విలువ అంతర్గతంగా సుమారు రూ. 138.7 కోట్లుగా ఉంటుంది.

అన్ని వర్గాలపై ప్రభావం: బ్రాడ్‌కాస్టర్లు తమ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ భారాన్ని ఐసీసీ భరించాల్సి ఉంటుంది – ఆపై అది మిగిలిన సభ్య దేశాలకు బదిలీ అవుతుంది. ఆదాయం తగ్గితే సభ్య బోర్డులకు ఇచ్చే వాటా తగ్గుతుంది. ముఖ్యంగా ఐసీసీ నిధులపైనే ఆధారపడే చిన్న దేశాలు, అసోసియేట్ సభ్యులు వెంటనే ఇబ్బందుల్లో పడతారు.

భారత్, పాకిస్థాన్: నివేదికల ప్రకారం, ఈ మ్యాచ్ జరగకపోతే రెండు బోర్డులు తలా రూ. 200 కోట్ల వరకు ప్రత్యక్ష, పరోక్ష ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. భారత్‌కు ఇది నష్టమే అయినా తట్టుకోగలదు. కానీ పాకిస్థాన్‌కు ఇది మనుగడ ప్రశ్న.

పీసీబీ ఐసీసీ మొత్తం ఆదాయంలో 5.75% వాటా వస్తుంది. అంటే ఏడాదికి సుమారు 34.51 మిలియన్ డాలర్లు. ఈ ఆదాయం నిబంధనల పాటింపు, భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది. స్వచ్ఛందంగా తప్పుకోవడం అనేది ‘ఫోర్స్ మెజ్యూర్’ (అనివార్య కారణాలు) కిందకు రాదు.

భీమా రక్షణ ఉండదు.

చట్టపరమైన రక్షణ ఉండదు.

నష్టపరిహారం, జరిమానాలను పూర్తిగా భరించాల్సి ఉంటుంది.

ఐసీసీ సభ్యత్వ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల టోర్నమెంట్ చెల్లింపులు ఆగిపోవచ్చు, జరిమానాలు పడవచ్చు. బ్రాడ్‌కాస్టర్ల నుంmr చట్టపరమైన ఇబ్బందులు ఎదురై కోట్లాది రూపాయల నష్టం వాటిల్లవచ్చు.

దీర్ఘకాలిక ప్రభావం: నగదు కంటే విశ్వసనీయత ముఖ్యం..

తక్షణ జరిమానాల కంటే ప్రమాదకరమైనది ‘ప్రతిష్ట’ దెబ్బతినడం. బ్రాడ్‌కాస్టర్లు అనిశ్చితిని ఇష్టపడరు. ఒకసారి బహిష్కరిస్తే, పాకిస్థాన్ మ్యాచ్‌లను ‘రిస్క్’ (ప్రమాదం) ఉన్నవిగా పరిగణిస్తారు.

భవిష్యత్తులో పాకిస్థాన్ మ్యాచ్‌ల ప్రసార విలువ తగ్గుతుంది.

స్పాన్సర్‌షిప్ ఆసక్తి తగ్గుతుంది.

అంటే, నేడు ఒక మ్యాచ్‌ను వదులుకోవడం వల్ల ఏటా వచ్చే ఆదాయం శాశ్వతంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.

విశ్వసనీయత లేని బోర్డులకు భవిష్యత్తులో వాణిజ్య ఒప్పందాల సమయంలో ప్రాధాన్యత ఉండదు.

అభిమానుల పరిస్థితి..

లెక్కల మధ్యలో నలిగిపోయేది అభిమానులు. ఈ మ్యాచ్ కోసం విమానాలు, హోటళ్లు, టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది అభిమానులకు కలిగే నష్టం వ్యక్తిగతం, దానిని ఎవరూ భర్తీ చేయలేరు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us