తెలంగాణ బిడ్డ మలావత్ పూర్ణ మరో ఘనత సాధించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ ప్రపంచంలోని 7 ఖండాల్లో 7 పర్వత శిఖరాలను అధిరోహించి సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పింది. 13 ఏళ్ల వయసులోనే అంటే 2014వ సంవత్సరంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి సత్తా చాటి, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. తాజాగా అలస్కా(అమెరికా) ప్రాంతంలోని సముద్ర మట్టానికి 6,190 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ డెనాలీ పర్వతాన్ని అధిరోహించింది. జూన్ 5న డెనాలీ శిఖరానికి చేరుకున్న పూర్ణ.. మే 23న ఈ యాత్రను ప్రారంభించింది. తాజా రికార్డుపై ఆమె కోచ్ శేఖర్‌బాబు సంతోషం వ్యక్తి చేశాడు. 2014లో పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలుగా నిలిచింది.
హైదరాబాదులోని ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్, 7-సమ్మిట్ ఛాలెంజ్‌ని పూర్తి చేయడంలో ఆమెకు సహాయం చేశాయి. ACE ఇంజినీరింగ్ అకాడమీ కూడా పూర్ణకు మద్దతుగా నిలిచింది. ఇప్పటివరకు మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా, 2014), మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా, 2016), మౌంట్ ఎల్బ్రస్ (యూరోప్, 2017), మౌంట్ అకాన్‌కాగువా (దక్షిణ అమెరికా, 2019), మౌంట్ కార్ట్స్‌నెజ్ (ఓషియానియా, 2019, Mt. విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా, 2019)లో అధిరోహించింది. తాజాగా ఉత్తర అమెరికాలోని మౌంట్ డెనాలి శిఖరాన్ని అధిరోహించింది. మొత్తంగా 7 ఖండాల్లోని 7 పర్వత శిఖరాలను అధిరోహించి రికార్డ్ సాధించింది.