Saina Nehwal: ప్రతి క్రీడలోనూ దిగ్గజ క్రికెటర్లు ఉంటారు. భారత్‌కి క్రికెట్‌లో కపిల్ దేవ్, సచిన్, గంగూలీ, ధోని, కోహ్లీ.. చెస్‌లో ఆనంద్.. హాకీలో ద్యాన్‌చంద్ మాదిరిగానే బాడ్మింటన్ దిగ్గజాల్లో సైనా నెహ్వాల్ కూడా ఒకరు. కామన్వెల్త్, ఒలింపిక్ క్రీడల్లో సత్తా చాటిన ఈ హైదరాబాదీ ప్లేయర్ త్వరలో జరగబోయే పారీస్ ఒలంపిక్స్, తన రిటైర్‌మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చివరి సారిగా ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ (2019) గెలిచిన సైనా నెహ్వాల్ గత ఏడాది జూన్ నుంచి ఆటకు దూరంగా ఉంటోంది. దీంతో సైనా ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్‌గా ఉన్నా ప్రస్తుతం 55వ ర్యాంక్‍లో కొనసాగుతోంది. మరోవైపు వచ్చే ఏడాది జరిగే పారిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌కు సైనా అర్హత సాధించేందుకు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సైనా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పారీస్ ఒలంపిక్స్ ద్వారా పునరాగమనం చేయడంపై సైనా మాట్లాడుతూ ‘,గంట,రెండు గంటలు ప్రాక్టీస్ చేసినప్పుడు నా మోకాలిలో నొప్పి వస్తుంది. నేను నా మోకాలిని వంచలేను కాబట్టి రెండో సెషన్ ప్రాక్టీస్ ఇప్పట్లో సాధ్యం కాదు. డాక్టర్లు నాకు రెండు ఇంజెక్షన్లు ఇచ్చారు. అయితే, ఒలింపిక్స్‌కు దగ్గర్లోనే ఉంది, దానికి అర్హత సాధించడం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో ఆడితే ఫలితాలు కూడా మంచిగా రావు. యాన్ సెయాంగ్, తాయ్ ట్జు యింగ్, అకానే వంటి ఉన్నత స్థాయి ప్లేయర్లతో పోటీ పడాలంటే, గంట ట్రైనింగ్ సరిపోదు. మనకు కూడా ఉన్నత స్థాయి ఆట అవసరం, నేను మొదటగా సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నా. ఆడటం చాలా సులభం కానీ గాయాల నుంచి శరీరాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం’ అని తెలిపింది.
అలాగే తన రిటైర్మెంట్‌పై కూడా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ ‘అందరూ ఏదో ఒక రోజు రిటైర్ అవ్వాలి. దానికి ఎలాంటి గడువు లేదు. శరీరం మీకు మద్దతు ఇవ్వడం లేదని మీరు భావించినప్పుడు ఆటను ఆపేస్తారు. కానీ ప్రస్తుతానికి నేను ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఒక స్పోర్ట్స్ పర్సన్‌గా, నేను ఆటను ప్రేమిస్తున్నాను, నేను చాలా సంవత్సరాలుగా ఆడుతున్నాను కాబట్టి మళ్లీ ఆడేందుకు ప్రయత్నించడం నా కర్తవ్యం’ అని పేర్కొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..