ఇస్తాంబుల్‌లో జరిగిన మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్(Womens World Boxing Championships 2022)ల ఫ్లైవెయిట్ (52 కిలోలు) విభాగంలో ఏకపక్షంగా సాగిన ఫైనల్‌లో థాయిలాండ్‌కు చెందిన జిట్‌పాంగ్ జుటామాస్‌ను 5-0తో ఓడించిన భారత బాక్సర్ నిఖత్ జరీన్(Nikhat Zareen) ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ బాక్సర్ జరీన్ ఏకగ్రీవ నిర్ణయంతో థాయ్‌లాండ్ ప్రత్యర్థిపై విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఐదో భారతీయ మహిళా బాక్సర్‌గా జరీన్ నిలిచింది. ఆమె విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
ఈమేరకు మన బాక్సర్లు మనల్ని గర్వపడేలా చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన బంగారు పతకం సాధించినందుకు నిఖత్ జరీన్‌కు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ఇదే పోటీలో కాంస్య పతకాలు సాధించిన మనీషా మౌన్, పర్వీన్ హుడాలను కూడా అభినందిచారు.
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. మీ విజయానికి భారతదేశం గర్విస్తోంది. మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
ప్రతిష్టాత్మక ‘ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్’ పోటీల్లో జరీన్ విశ్వ విజేతగా నిలిచినందుకు తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్‌కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని, తెలంగాణలోని ప్రతీ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి, యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని సీఎం తెలిపారు.
ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఎంసీ మేరీకోమ్ (2002, 2005, 2006, 2008, 2010, 2018), సరితా దేవి (2006), జెన్నీ ఆర్‌ఎల్ (2006), లేఖా కేసీ ఇంతకు ముందు ప్రపంచ టైటిల్‌లు గెలుచుకున్నారు. జరీన్ బంగారు పతకాలతో పాటు, మనీషా మోన్ (57 కేజీలు), అరంగేట్రం పర్వీన్ హుడా (63 కేజీలు) కాంస్య పతకాలను గెలుచుకున్నారు.
భారత్ నుంచి 12 మంది సభ్యుల బృందం ఈ టోర్నీలో పాల్గొంది. గత టోర్నీతో పోలిస్తే భారత్ పతకాల సంఖ్య తగ్గింది. అయితే నాలుగేళ్ల తర్వాత భారత బాక్సర్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. మేరీకోమ్ 2018లో భారత్‌కు చివరి స్వర్ణ పతకాన్ని అందించింది.
Our boxers have made us proud! Congratulations to @nikhat_zareen for a fantastic Gold medal win at the Women’s World Boxing Championship. I also congratulate Manisha Moun and Parveen Hooda for their Bronze medals in the same competition. pic.twitter.com/dP7p59zQoS
— Narendra Modi (@narendramodi) May 19, 2022
ప్రతిష్టాత్మక ‘ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్’ పోటీల్లో నిజామాబాద్ కు చెందిన @Nikhat_Zareen విశ్వ విజేతగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. #NikhatZareen pic.twitter.com/UP7vnm5GQ4
— Telangana CMO (@TelanganaCMO) May 19, 2022