Lovlina Borgohain: పసిడి పతకాల లెక్క ‘తగ్గేదేలే’.. భారత్ ఖాతాలో 4కి చేరిన గోల్డ్ మెడల్స్.. పూర్తి వివరాలివే..

|

Mar 26, 2023 | 8:54 PM

ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఐబీఏ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ అమ్మాయిలు తమకు నిలిచిన ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్నారు. ఆదివారం జరిగిన 2 ఫైనల్స్‌లో మన అమ్మాయిలు తమ సత్తాచాటి రెండు పసిడి పతకాలను గెలిచారు. ముందుగా తెలుగమ్మాయి నిఖత్ జరీన్ ..

Lovlina Borgohain: పసిడి పతకాల లెక్క ‘తగ్గేదేలే’.. భారత్ ఖాతాలో 4కి చేరిన గోల్డ్ మెడల్స్.. పూర్తి వివరాలివే..
Lovlina Borgohain
Follow us on

ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఐబీఏ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ అమ్మాయిలు తమకు నిలిచిన ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్నారు. రెండు రోజుల్లో రెండేసి ఫైనల్స్ ఆడిన మన అమ్మాయిలు ప్రతి మ్యాచ్‌లలోనూ పసిడి పతకాన్ని గెలిచారు. ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా శనివారం జరిగిన ఫైనల్స్‌లో నీతూ గంగాస్, స్వీటీ బూరా పసిడి పతకాలను సాధించగా.. ఆదివారం తెలుగమ్మాయి నిఖత్ జరీన్ బంగారు పతకాన్ని మెడలో వేసుకుంది. ఆదే తరహాలో తాజాగా 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ కూడా స్వర్ణాన్ని ముద్దాడింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లలో ముందుగా 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ వియత్నాం బాక్సర్ న్యూయెన్ టి తామ్‌ను 5-0 తేడాతో మట్టికరిపించి వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. ఆ వెంటనే 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ కూడా ఆస్ట్రేలియా బాక్సర్ కైత్లిన్‌ పార్కర్‌పై 5-2 తేడాతో విజయం సాధించింది. దీంతో 2 రోజులలో భారత్ ఖాతాలో 4 పసిడి పతకాలు వచ్చి చేరినట్లయింది.

ఇక అంతకముందు అంటే శనివారం జరిగిన 48 కేజీల విభాగంలో నీతూ గంగాస్ 5-0 తేడాతో.. మంగోలియా మహిళా బాక్సర్ లుత్సాయ్ ఖాన్‌పై విజయం సాధించింది. తద్వారా భారత్ ఖాతాలో మొదటి పసిడి పతకం చేరింది. అనంతరం జరిగిన 81 కిలోల విభాగంలో హర్యానాకు చెందిన స్వీటి బూరా కూడా చైనా బాక్సర్ వాంగ్ లీనాను 4-3తో ఓడించి తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణాన్ని గెలుచుకుంది.దీంతో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది. ఇక ఈ రోజు నిఖత్, లవ్లీనా గెలిచిన బంగారు పతకాలతో లెక్క నాలుగుకి చేరింది.

కాగా, చివరిగా బంగారు పతకం సాధించిన లవ్లీనాకు ఇదే తొలి ప్రపంచ చాంపియన్‌షిప్. అంతకముందు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచింది లవ్లీనా. అలాగే  ఇప్పటివరకు భారత్ తరఫున.. 2002, 2005, 2006, 2008, 2010, 2018లో మేరీ కోమ్ పసిడి పతకాలు నెగ్గుకొచ్చింది. అలాగే 2006లో సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ స్వర్ణాలను అందుకున్నారు. ఇక గతేడాది అంటే 2022లో బంగారు పతకాన్ని అందుకున్న నిఖత్ జరీన్.. ఈ రోజు కూడా అందే తరహాలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది.

మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..