మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది జపాన్ టెన్నిస్ సంచలన ప్లేయర్ నవోమి ఒసాకా. తనపై ప్రేమ చూపిస్తూ.. సపర్ట్‌గా నిలిచిన అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. మానసిక సమస్యలతో ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగిన ఐదు రోజుల తర్వాత ఒసాకా ఈ మేరకు స్పందించింది.
ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్‌లో పార్టిసియా మారియాపై విజయం సాధించిన ఒసాకా.. తర్వాత నిర్వహించిన మీడియా సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించి ఆమెకు 15వేల డాలర్ల జరిమానా విధించారు నిర్వాహకులు. మరోసారి ఇది పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది ఒసాకా.
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగిన జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకాకు వరల్డ్ నంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ సెల్యూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె నిర్ణయం ఎంతో సాహసోపేతమైందని కొనియాడాడు. నవోమికి నా మద్దతు ఉంటుంది… ఆమె సాహసోపేత నిర్ణయం తీసుకొందని జొకోవిచ్ తెలిపాడు.
ఇక మరోవైపు ఎఫ్-1 వరల్డ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ కూడా ఒసాకకు అండగా నిలిచాడు. ఒసాకా వేగంగా కోలుకొని మరింత బలంగా తిరిగొస్తుందని ఆశిస్తున్నానన్నాడు. ఒసాకా ఒంటరి కాదని.. ఎంతో మంది తన వెంట ఉన్నారన్న విశ్వాసం ఆమెలో కలిగించాలని తన ఫాలోవర్లను కోరుతూ హామిల్టన్ ట్వీట్ చేశాడు.