Esports World Cup 2026: మాగ్నస్ కార్ల్‌సన్‌తో ఢీ.. రూ.14.2 కోట్ల టైటిల్ వేటలో నలుగురు భారత చెస్ స్టార్లు

Esports World Cup 2026: పారిస్‌లో జరగనున్న ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ 2026 చెస్ టోర్నీలో నలుగురు భారత గ్రాండ్‌మాస్టర్లు బరిలోకి దిగనున్నారు. నిహాల్ సరిన్, అరవింద్ చిదంబరం, ప్రణేష్ ఎం, అర్జున్ ఎరిగాసి మాగ్నస్ కార్ల్‌సన్, హికారూ నకమురా వంటి ప్రపంచ దిగ్గజాలతో తలపడనున్నారు. రూ.14.2 కోట్ల ప్రైజ్‌మనీ కోసం ఉత్కంఠభరిత పోరు సాగనుంది.

Esports World Cup 2026: మాగ్నస్ కార్ల్‌సన్‌తో ఢీ.. రూ.14.2 కోట్ల టైటిల్ వేటలో నలుగురు భారత చెస్ స్టార్లు
Chess

Updated on: Aug 07, 2026 | 5:31 PM

Esports World Cup 2026: ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఆగస్టు 11 నుంచి 15 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ 2026 చెస్ టోర్నమెంట్‌లో నలుగురు భారత గ్రాండ్ మాస్టర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత యంగ్ సంచలనాలు నిహాల్ సరిన్, అరవింద్ చిదంబరం, ప్రణేష్ ఎం, అర్జున్ ఎరిగాసి ఈ మెగా టోర్నీలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ చెస్ క్రీడాకారులతో వీరు హోరాహోరీగా తలపడనున్నారు.

ఏ జట్టు తరఫున ఎవరు ఆడుతున్నారు?

ఈ పోటీల్లో భారత ఆటగాళ్లు అంతర్జాతీయ ఈస్పోర్ట్స్ ఫ్రాంచైజీల తరఫున బరిలోకి దిగుతున్నారు. నిహాల్ సరిన్, అరవింద్ చిదంబరం, ప్రణేష్ ఎంలు ప్రముఖ గేమింగ్ కంటెంట్ సంస్థ అయిన S8UL ఈస్పోర్ట్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తుండగా, స్టార్ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగాసి జెన్ జీ ఈస్పోర్ట్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈ నలుగురు క్రీడాకారులు తమ అద్భుతమైన నైపుణ్యంతో భారత్‌కు విజయాన్ని అందించాలని పట్టుదలతో ఉన్నారు.

రూ. 14.2 కోట్ల ప్రైజ్‌మనీ.. దిగ్గజాలతో పోరు

ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ ఏకంగా 15 లక్షల యూఎస్ డాలర్లు (దాదాపు రూ. 14.2 కోట్లు). ఈ బహుమతి నిధి కోసం ప్రపంచ చెస్ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ మేగ్నస్ కార్ల్‌సన్ (టీమ్ లిక్విడ్)తో భారత క్రీడాకారులు పోటీపడనున్నారు. కార్ల్‌సన్‌తో పాటు హికారూ నకమురా, అలీరెజా ఫిరూజ్జా (టీమ్ ఫాల్కన్స్), నోదిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్ (నాటస్ విన్సెరే), హాన్స్ మోకే నీమాన్ (గాడ్‌లైక్ ఈస్పోర్ట్స్) వంటి దిగ్గజ క్రీడాకారులు కూడా ఈ ప్రపంచ కప్‌లో పాల్గొంటున్నారు.

క్వాలిఫికేషన్, టోర్నీ ఫార్మాట్ వివరాలు

చాంపియన్స్ చెస్ టూర్ (CCT) 2025-2026 లో చూపించిన అద్భుతమైన ప్రదర్శనతో నిహాల్, ప్రణేష్, అర్జున్ డైరెక్ట్‌గా గ్రూప్ స్టేజ్‌కు అర్హత సాధించారు. అరవింద్ చిదంబరం డ్రీమ్‌హాక్ అట్లాంటా టోర్నీ ద్వారా ప్లే-ఇన్ స్టేజ్‌కు క్వాలిఫై అయ్యాడు. ఈ టోర్నీని కొత్త రెండు-దశల ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు:

ప్లే-ఇన్ స్టేజ్: ఇందులో డ్రీమ్‌హాక్ అట్లాంటా, లాస్ట్ ఛాన్స్ క్వాలిఫైయర్ ద్వారా వచ్చిన 9 మంది ఆటగాళ్లు డబుల్-ఎలిమినేషన్ పద్ధతిలో పోటీపడతారు.

గ్రూప్ స్టేజ్ : ప్లే-ఇన్ నుంచి ఎంపికైన వారు సీసీటీ ద్వారా నేరుగా వచ్చిన ఆటగాళ్లతో కలిపి మొత్తం 16 మందిగా గ్రూప్ స్టేజ్‌లో ఉంటారు. వీరిని 8 మంది చొప్పున రెండు గ్రూప్‌లుగా విడదీస్తారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 4 ప్లేయర్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటారు.

గత ఏడాది జరిగిన టోర్నీలో నిహాల్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరగా, అర్జున్ ఎరిగాసి నాల్గో స్థానంలో నిలిచి ఆకట్టుకున్నారు. ఈసారి భారత ఆటగాళ్లు టైటిల్ వేటపై కన్నేశారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us