Tokyo Olympics: శనివారం రాత్రి టోక్యో చేరుకున్న ఉగాండా ఒలింపిక్ జట్టులోని కోచ్‌కు కోవిడ్-19 పాజిటివ్ గా తేలిందని జపాన్ అధికారులు తెలిపారు. ఈమేరకు ఉగాండా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు డొనాల్డ్ రుకారే మాట్లాడుతూ.. ఒలింపిక్స్ కోసం టోక్యో చేరుకున్న టీంలో ఓ కోచ్‌కి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు జపాన్ ప్రభుత్వం అక్కడే చికిత్సను అందిస్తారా లేదా తిరిగి ఉగాండాకు పంపిస్తారా అనేది తెలియలేదని అన్నారు. ఉగాండా ఒలింపిక్ ప్రతినిధి బృందంలో మొత్తం 26 మంది అథ్లెట్లు, 30 మంది సహాయక సిబ్బంది ఉన్నారు. అయితే వీరందరికీ ఆస్ట్రాజెనెకా టీకాను ఇప్పించామని రుకారే తెలిపారు. ఇందులో చాలామంది మొదటి మోతాదును పొందిన మూడు నెలల తర్వాత.. ఈ నెలలో రెండవ మోతాదును కూడా వేసుకున్నారు. కోవిడ్-పాజిటివ్ వచ్చిన కోచ్‌తో మరో ఎనిమిది మంది ఒసాకా ప్రిఫెక్చర్‌లోని ఇజుమిసానో నగరంలో ఉంచారని తెలుస్తోంది. వీరందరని అక్కడే ఉంచుతున్నట్లు ఇజుమిసానో నగర అధికారి హిడియో తకాగాకి తెలిపినట్లు రుకారే పేర్కొన్నారు. వీరంతా బయో బుడగలో ఉన్నారని, వీరికి ప్రతిరోజూ కోవిడ్ టెస్టులు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఉగాండా ఒలింపిక్ జట్టు నుంచి ఎక్కువ మంది అథ్లెట్లు, సిబ్బంది విడతల వారీగా జపాన్ చేరుకోనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు జపాన్‌కు చేరుకున్న దేశాల్లో ఉగాండా అథ్లెట్లు మొదటివారు. కోవిడ్ -19 ఫోర్త్ వేవ్ తో ఉగాండా దేశం పోరాడుతుంది. దీంతో కట్టుదిట్టమైన భద్రతల మధ్య వీరంతా జపాన్ వెళ్లనున్నారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ క్రీడల్లో 205 దేశాల నుంచి 11,091 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. అయితే, జపాన్ లో కరోనా కారణంగా అక్కడి వైద్య సంఘాలు ఒలింపిక్స్ నిర్వహించడంపై వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఒలింపిక్స్ నిర్వహిస్తే.. తరువాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని ఆరోపిస్తున్నాయి. జపాన్ జనాభాలో ఇప్పటి వరకు 7శాతం మందికి మాత్రమే టీకాలు వేశారు. దీంతో అక్కడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు జూన్ మొదటి, రెండు వారాల్లో ఉగాండాలో కేసులు 130 శాతం పెరిగాయి. ఉగాండాలో పాజిటివిటీ రేటు అధికంగా ఉంది. అలాగే ఉగాండా రగ్బీ యూనియన్ తన జాతీయ సెవెన్స్ జట్టు మొనాకోలో జరగాల్సిన ఒలింపిక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ నుంచి వైదొలిగినట్లు ట్వీట్ చేసింది.
Also Read:
Usain Bolt: ఉసేన్ బోల్ట్ దంపతులకు కవలలు.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న పేర్లు!
Milkha Singh: “రియల్ హీరోకు.. రీల్ హీరోకి తేడా తెలియదా”..! నోయిడా స్టేడియం సిబ్బందిపై నెటిజన్ల ఫైర్