Praggnanandhaa : నార్వే చెస్ టోర్నీలో భారత్ సంచలనం.. వరల్డ్ నంబర్ వన్ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన ప్రజ్ఞానంద

Praggnanandhaa : ప్రతిష్టాత్మక నార్వే చెస్(Norway Chess 2026) టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరోసారి అద్భుతమైన విశ్వరూపం ప్రదర్శించాడు. బుధవారం రాత్రి జరిగిన మూడో రౌండ్ క్లాసికల్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్, నార్వే లెజెండ్ మాగ్నస్ కార్ల్‌సన్‎ను అతని సొంత గడ్డపైనే మట్టికరిపించి 3 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

Praggnanandhaa : నార్వే చెస్ టోర్నీలో భారత్ సంచలనం.. వరల్డ్ నంబర్ వన్ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన ప్రజ్ఞానంద
Praggnanandhaa

Updated on: May 28, 2026 | 2:57 PM

Praggnanandhaa : నార్వే వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక నార్వే చెస్(Norway Chess 2026) టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరోసారి అద్భుతమైన విశ్వరూపం ప్రదర్శించాడు. బుధవారం రాత్రి జరిగిన మూడో రౌండ్ క్లాసికల్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్, నార్వే లెజెండ్ మాగ్నస్ కార్ల్‌సన్‎ను అతని సొంత గడ్డపైనే మట్టికరిపించి 3 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత ఉత్కంఠభరితంగా, చివరి సెకన్ల వరకు నరాల తెగేలా సాగిన ఈ టైమ్ కంట్రోల్ పోరులో ప్రజ్ఞానంద అద్భుతమైన సంయమనం పాటించి కార్ల్‌సన్‌పై పైచేయి సాధించాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద మొత్తం 4.5 పాయింట్లతో టోర్నీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. గత 2024 నార్వే చెస్ టోర్నీలో కూడా కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద.. క్లాసికల్ చెస్‌లో అతన్ని ఓడించడం ఇది రెండోసారి కావడం విశేషం.

ఈ అద్భుత విజయంపై ప్రజ్ఞానంద మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడుతూ.. “నిజం చెప్పాలంటే, ఇది అంతగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన గెలుపు కాదు. చివరి నిమిషాల్లో టైమ్ ప్రెజర్ ఉన్నప్పుడు ఆట అనేది టాస్ వేయడం లాంటిది. అది మాగ్నస్ వైపైనా వెళ్ళచ్చు, నా వైపైనా రావచ్చు. కాబట్టి ఈ గెలుపు చూసి నేనేదో గొప్పగా ఫీలవ్వడం లేదు. అయితే మ్యాచ్ ఫస్ట్ హాఫ్ లోనే నేను కంట్రోల్‌తో బాగా ఆడాననే తృప్తి ఉంది” అని పేర్కొన్నాడు. మరోవైపు కార్ల్‌సన్ ఈ ఓటమితో కేవలం 1.5 పాయింట్లతో పట్టికలో అందరికంటే చివరి స్థానంలో నిలవడం చెస్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, భారత స్టార్ డీ గుకేష్ ‎కు ఈ టోర్నీలో మాత్రం వరుసగా నిరాశే ఎదురవుతోంది. ఫ్రాన్స్‌కు చెందిన అలీరెజా ఫిరౌజాతో జరిగిన మ్యాచ్‌లో గుకేష్ ఓటమిపాలయ్యాడు. నిజానికి వీరిద్దరి మధ్య జరిగిన క్లాసికల్ గేమ్ డ్రాగా ముగిసింది. అయితే, విజేతను తేల్చడానికి నిర్వహించిన టైబ్రేకర్ మ్యాచ్‌లో ఫిరౌజా అద్భుత విజయం సాధించి 7.5 పాయింట్లతో టోర్నీలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక్కడ విశేషం ఏంటంటే.. ఫిరౌజా గత టోర్నీలో తగిలిన గాయం కారణంగా నడవలేక వీల్‌చైర్‌లో వేదిక వద్దకు వచ్చాడు. తన కుడి కాలును పక్కనే ఉన్న కుర్చీపై పెట్టుకుని, తీవ్రమైన నొప్పితోనే ఆడుతూ గుకేష్‌కు షాకిచ్చాడు. ఈ ఓటమితో గుకేష్ 3.5 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయాడు. ఈ ఏడాది చివర్లో జావోఖిర్ సిందరోవ్‎తో జరగబోయే వరల్డ్ టైటిల్ పోరుకు సిద్ధమవుతున్న గుకేష్.. ఇలా ఫామ్ కోల్పోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

మహిళల విభాగంలో భారత యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. టోర్నీ లీడర్ అయిన కజకిస్తాన్ క్రీడాకారిణి బిబిసార అసౌబయేవాను ఓడించి సంచలనం సృష్టించింది. ఈ టోర్నమెంట్‌లో దివ్యకు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ప్రస్తుతం ఆమె 4.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి, 5.5 పాయింట్లతో టాప్‌లో ఉన్న బిబిసారకు గట్టి పోటీ ఇస్తోంది.

అయితే, భారత సీనియర్ క్రీడాకారిణి, మాజీ వరల్డ్ రాపిడ్ ఛాంపియన్ కోనేరు హంపికి మాత్రం లక్ కలిసిరావడం లేదు. మూడో రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అన్నా ముజిచుక్ (ఉక్రెయిన్) చేతిలో హంపి పరాజయం పాలైంది. కేవలం 2 పాయింట్లతో హంపి పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. వచ్చే నాలుగో రౌండ్‌లో మాగ్నస్ కార్ల్‌సన్, డీ గుకేష్ మధ్య హై-వోల్టేజ్ పోరు జరగనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us