Bizarre Cricket Match: క్రికెట్ అంటేనే సంచలనాలకు కేరాఫ్. ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియదు. ఏ మ్యాచ్‌లో ఏ రికార్డ్ నమోదు అవుతుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా దేశవాళీ మహిళల వన్డే ట్రోఫీలో ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది. 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌లో నాగాలాండ్ జట్టు కేవలం 17 పరుగులకే ఆలౌట్ అయి హవ్వా అనిపిస్తే.. ఆ లక్ష్యాన్ని కేవలం 4 బంతుల్లోనే పూర్తి చేసి వావ్ అనిపించింది ముంబై జట్టు. బుధవారం నాడు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నాగాలాండ్, ముంబై జట్లు తలబడ్డాయి. తొలుత టాస్ గెలిచిన నాగాలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
అయితే.. ముంబై కెప్టెన్, పేస్ బౌలర్ అయిన సయాలి తన బౌలింగ్‌తో వీరవిహారం చేసింది. 8 ఓవర్లు వేసిన సయాలి.. 7 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. సయాలి దెబ్బకు నాగాలాండ్ టీమ్ ప్లేయర్లు కికయాంగ్లా(0), జ్యోతి(0), కెప్టెన్ సెంటిలెమ్లా (0), ఎలినా (0) తో వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఆ తరువాత వచ్చిన వారి పరిస్థితి కూడా అంతే.. ఏ ఒక్కరూ సింగిల్ డిజిట్ స్కోర్‌ను దాటలేకపోయారు. ఈ టీమ్‌లో అత్యధికంగా సరిబా(9) పరుగులు చేసి టాప్‌లో నిలిచింది. మొత్తంగా నాగాలాండ్ జట్టు 17.4 ఓవర్లు ఆడి కేవలం 17 పరుగులు మాత్రమే చేసింది.
ఇక 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు కేవలం 4 బంతుల్లోనే పని పూర్తి కానిచ్చేసింది. ముంబై ఓపెనర్లు ఇషా ఓజా, వృషాలి భగత్‌లు తొలి ఓవర్ నాలుగు బంతుల్లోనే నిర్ణీత లక్ష్యాన్ని ఛేదించారు. ఆడిన నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అదరగొట్టి ఔరా అనిపించారు. మొత్తంగా 17.04 ఓవర్లు ఆడిన నాగాలాండ్ 17 పరుగులు చేయగా.. కేవలం నాలుగు బంతులు ఆడిన ముంబై 20 పరుగులు చేసి పది వికెట్ల తేడాతో ఘనం విజయం సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.
Tweet:
Unbelievable Womens Senior One Day Trophy (2020-21) game in Indore.
Nagaland 17 (17.4)
Mumbai chased down the total in only 4 balls! pic.twitter.com/of0oKp6ryQ
— Sarang Bhalerao (@bhaleraosarang) March 17, 2021