Archer Jyothi Surekha : 90 పతకాలు తెచ్చినా గుర్తింపు లేదా? తెలుగు తేజానికి అన్యాయంపై ఎంపీ గురుమూర్తి నిప్పులు
Archer Jyothi Surekha : ప్రపంచస్థాయిలో తెలుగు తేజం జ్యోతి సురేఖ పతకాల పంట పండిస్తున్నా, ఎంపిక ప్రక్రియలో ఆమెను విస్మరించడంపై రాజకీయ నాయకులు, క్రీడాభిమానులు మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి ఘాటైన లేఖ రాశారు.

Archer Jyothi Surekha : దేశ గర్వించదగ్గ ఆర్చరీ క్రీడాకారిణి, తెలుగు తేజం జ్యోతి సురేఖకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు విషయంలో అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రపంచస్థాయిలో పతకాల పంట పండిస్తున్నా, ఎంపిక ప్రక్రియలో ఆమెను విస్మరించడంపై రాజకీయ నాయకులు, క్రీడాభిమానులు మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి ఘాటైన లేఖ రాశారు.
ప్రపంచ కాంపౌండ్ ఆర్చరీలో జ్యోతి సురేఖ పేరు తెలియని వారు ఉండరు. గడిచిన పదేళ్లుగా అంతర్జాతీయ వేదికలపై భారత్ జెండాను రెపరెపలాడిస్తున్న ఈమె, ఇప్పటివరకు ఏకంగా 90కి పైగా అంతర్జాతీయ పతకాలను సాధించి రికార్డు సృష్టించారు. వరల్డ్ కప్‌లు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో తిరుగులేని ప్రదర్శన చేస్తున్నా, దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన ఖేల్‌రత్నకు ఆమె పేరును పదే పదే తప్పించడంపై ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీకి రాసిన లేఖలో ఆయన ఎంపిక ప్రక్రియలోని లోపాలను ఎత్తిచూపారు.
2011 నుంచి 2025 వరకు వరుసగా 8 ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించడం మామూలు విషయం కాదని, ఇది ఆమె నిలకడైన ప్రతిభకు నిదర్శనమని ఎంపీ పేర్కొన్నారు. ఇప్పటికే అర్జున అవార్డు అందుకున్న జ్యోతి సురేఖను, ఖేల్‌రత్న రేసులో పరిగణనలోకి తీసుకోకపోవడం ఎంపిక కమిటీ నిష్పక్షపాతతపై సందేహాలు కలిగిస్తోందని ఆయన విమర్శించారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఆర్చరీ వంటి క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే మహిళా క్రీడాకారులు నిరుత్సాహానికి గురవుతారని, ఇది యువతలో నమ్మకాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ స్థాయి అవార్డులు కేవలం రికార్డుల కోసం ఇచ్చేవి కావని, అవి ప్రతిభకు ఇచ్చే పట్టాభిషేకాలని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఖేల్‌రత్న ఎంపిక విధానాన్ని పునఃసమీక్షించాలని, జ్యోతి సురేఖ లాంటి దీర్ఘకాలిక ప్రతిభావంతులకు తగిన గుర్తింపు ఇచ్చి గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్చరీలో ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఉన్న జ్యోతికి న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామని ఈ సందర్భంగా క్రీడా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
