
FIFA World Cup 2030 : ప్రపంచవ్యాప్తంగా సాకర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2030 ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశాల్లో ఒకటి మొరాకో. స్పెయిన్, పోర్చుగల్‌లతో కలిసి ఈ టోర్నమెంట్‌ను మొరాకో సంయుక్తంగా నిర్వహించనుంది. అయితే ఈ మెగా ఈవెంట్‌కు ముందు మొరాకోపై ఒక తీవ్రమైన ఆరోపణ వచ్చి పెద్ద దుమారం రేపుతోంది. ప్రపంచ కప్ కోసం మొరాకో వేలాదిగా వీధి కుక్కలను చంపేస్తుందని జంతు హక్కుల సంస్థలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.
2030 ఫిఫా వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వబోతున్న మొరాకోపై జంతు సంక్షేమ సంస్థలు తీవ్ర ఆరోపణలు చేశాయి. దీని వెనుక ప్రధాన కారణం మొరాకో వీధుల్లో తిరిగే దాదాపు 30 లక్షల వీధి కుక్కలు. స్థానికంగా ఈ కుక్కలను ప్రజారోగ్యానికి, భద్రతకు ముప్పుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొరాకో ప్రభుత్వం 2030 ప్రపంచ కప్ కోసం వీధులను శుభ్రం చేసే పేరుతో లక్షల సంఖ్యలో వీధి కుక్కలను చంపేయాలని ప్రణాళిక వేసినట్లు జంతు హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ఇటీవల ఒక వీధి కుక్కను బహిరంగంగా కాల్చి చంపిన ఘటనతో పాటు, రక్తపు మరకలతో ఉన్న కుక్కల మృతదేహాలు, ఒక నవజాత కుక్కపిల్లను తన్ని చంపిన దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం సృష్టించాయి. ఈ వివాదం మొరాకోలో వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ టోర్నమెంట్ నేపథ్యంలో మరింత సున్నితంగా మారింది.
ఇంటర్నేషనల్ యానిమల్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కొలిషన్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. మొరాకో ప్రపంచ కప్ సహ-ఆతిథ్య దేశంగా ప్రకటించిన తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని, ఇది ఇప్పుడు అదుపు తప్పిందని ఆందోళన వ్యక్తం చేశారు. మొరాకో ప్రభుత్వం వీధులను శుభ్రం చేయడానికి వేలాది కుక్కలను చంపుతోందని ఆరోపణలు వచ్చాయి. ఈ చర్యలు కేవలం ప్రపంచ కప్ కోసం పర్యాటకులను ఆకర్షించేందుకు, దేశాన్ని శుభ్రంగా చూపించేందుకు చేపడుతున్నారని జంతు ప్రేమికులు విమర్శిస్తున్నారు.
తమపై వస్తున్న ఆరోపణలను మొరాకో ప్రభుత్వం, లండన్‌లోని మొరాకో రాయబార కార్యాలయం ఖండించాయి. వీధి కుక్కలను చంపడానికి ప్రపంచ కప్‌కు ఎలాంటి సంబంధం లేదని మొరాకో ప్రభుత్వం స్పష్టం చేసింది.మొరాకో రాజధాని రబాత్ ప్రకారం.. వీధి జంతువుల నిర్వహణ బాధ్యతను స్థానిక మున్సిపాలిటీలకు అప్పగించినట్లు పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి ఐదు వేర్వేరు నగరాల్లో మరిన్ని కుక్కల ఆశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు మొరాకో ప్రభుత్వం ప్రకటించింది.
2030 ప్రపంచ కప్ మ్యాచ్‌లు మొరాకోలోని ఆరు నగరాల్లో ఆరు వారాల పాటు జరగనున్నాయి. ఫుట్‌బాల్ చరిత్రలో మొరాకోకు అద్భుతమైన రికార్డు ఉంది. 1970లో మొదటిసారి ఫైనల్స్‌కు చేరుకున్న ఈ ఆఫ్రికన్ జట్టు, 1986లో నాకౌట్ స్టేజ్ వరకు వెళ్లింది. ముఖ్యంగా 2022 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్ ఆడి చరిత్ర సృష్టించింది. అయితే ఈ గొప్ప విజయాలు కూడా ప్రస్తుతం వీధి కుక్కల వివాదం కారణంగా మరుగున పడుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..