T20 World Cup 2022: హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న టికెట్లు.. ఆ మ్యాచ్ ల కోసం భారీ డిమాండ్..

టీమ్‌ఇండియా సహా కొన్ని జట్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నాయి. మిగతా దేశాలూ చేరుకుంటున్నాయి. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లతో అక్కడ క్రికెట్‌ సందడి మొదలైంది. ఈ నెల 16వ తేదీ నుంచి తొలి రౌండ్‌..

T20 World Cup 2022: హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న టికెట్లు.. ఆ మ్యాచ్ ల కోసం భారీ డిమాండ్..
T20 World Cup

Updated on: Oct 14, 2022 | 1:58 PM

టీ20 ఫార్మట్ లో మరో మెగా టోర్నమెంట్ కు క్రికెట్‌ ప్రపంచం రెడీ అవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ అక్టోబర్ 16వ తేదీ (ఆదివారం) నుంచే ప్రారంభం కానుంది. రెండేళ్ల కరోనా పరిస్థితుల అనంతరం జరుగుతున్న మెగా టోర్నీ కావడంతో.. ఈ సారి టికెట్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. పెద్దసంఖ్యలో ప్రేక్షకులు స్టేడియంలో మ్యాచ్‌లను వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 6 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈ మెగా టోర్నమెంట్ కోసం టీమ్‌ఇండియా సహా కొన్ని జట్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నాయి. మిగతా దేశాలూ చేరుకుంటున్నాయి. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లతో అక్కడ క్రికెట్‌ సందడి మొదలైంది. ఈ నెల 16వ తేదీ నుంచి తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. సూపర్‌12లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలను దక్కించుకోవడం కోసం తొలి రౌండ్లో ఎనిమిది జట్లు పోటీపడతాయి. ఈ నెల 22వ తేదీ నుంచి సూపర్‌12 సమరం మొదలవుతుంది. సూపర్ 12లో ప్రధాన జట్లు పోటీపడతాయి. సూపర్ 12లో ఉన్న జట్లు మాత్రమే ప్రపంచకప్ ను దక్కించుకునే అవకాశం ఉంటుంది. టీ20 ప్రపంచ కప్ కోసం ఏడు ఆస్ట్రేలియా నగరాలు వేదికలుగా ఉన్నాయి.

సూపర్‌-12లో తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య జరగనుంది. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య సిడ్నీ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌.. గతేడాది ఫైనల్‌ పోరును తలపించేలా ఉండే అవకాశం లేకపోలేదు. ఈ ఆదివారం ప్రారంభ మ్యాచ్‌లతోపాటు సూపర్‌-12 మ్యాచ్‌ల్లో భారీ సంఖ్యలో ప్రేక్షకులను చూసేందుకు తాము ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ చీఫ్‌ మిచెల్‌ ఎన్‌రైట్‌ అన్నారు. ప్రతి మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు రిలీజ్ చేయగానే సేల్ అయిపోతున్నాయని నిర్వహకులు తెలిపారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

గీలాంగ్‌లోని 36,000 కెపాసిటీ గల కార్డినియా పార్క్ స్టేడియంలో UAE, నెదర్లాండ్స్‌ మ్యాచ్ తో పాటు శ్రీలంకతో నమీబియాతో తలపడే మ్యాచ్ లకు తక్కువ సంఖ్యలో టిక్కెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని నిర్వహకులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..