టీమిండియాను వెంటాడుతున్న గాయాల బెడద.. నాలుగో టెస్టుకు ముందు భారీ షాకులు.. జట్టు కూర్పుపై సందిగ్దత.!

India Vs Australia 2020: టీమిండియాకు అసలేమైంది.. ఒకవైపు గాయాలు.. మరోవైపు ఫామ్ లేమి.. ఆటగాళ్లను వెంటాడుతున్నాయి. ఆస్ట్రేలియా..

టీమిండియాను వెంటాడుతున్న గాయాల బెడద.. నాలుగో టెస్టుకు ముందు భారీ షాకులు.. జట్టు కూర్పుపై సందిగ్దత.!
Follow us

|

Updated on: Jan 12, 2021 | 3:58 PM

India Vs Australia 2020: టీమిండియాకు అసలేమైంది.. ఒకవైపు గాయాలు.. మరోవైపు ఫామ్ లేమి.. ఆటగాళ్లను వెంటాడుతున్నాయి. ఆస్ట్రేలియా టూర్ మొదలైన నాటి నుంచి ఏదో రకంగా భారత్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొదట్లో గాయం కారణంగా వన్డేలు, టీ20లు, తొలి రెండు టెస్టులకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ దూరం కాగా.. పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ మొత్తం సిరీస్‌కే దూరమయ్యాడు. అటు మరో బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ ఫిట్‌గా లేకపోవడంతో సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అనుభవం ఉన్న బ్యాట్స్‌మెన్, బౌలర్లు జట్టులో తక్కువగా ఉన్నా.. టీమిండియా వన్డేలు, టీ20లలో ఆదరగొట్టింది.

టెస్టుల విషయానికి వస్తే.. మొదటి మ్యాచ్‌ను కోహ్లీ సారధ్యంలో ఓడిపోయినప్పటికీ.. అతడు పితృత్వ సెలవులపై ఇండియా వచ్చిన తర్వాత.. తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహనే నేతృత్వంలో టీమిండియా బాక్సింగ్ డే టెస్టును గెలుపొందింది. అయితే ఈలోపే బౌలర్ ఉమేష్ యాదవ్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌లకు గాయాలు కావడంతో మూడో టెస్టుకు ముందు భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది.

ఇక సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్‌కు మరో దెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ హనుమ విహారిలకు గాయాలు కావడం.. అవి తీవ్రతరంగా మారడంతో ఈ ఇద్దరూ చివరి టెస్టు, స్వదేశంలో జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్‌కు కూడా దూరమయ్యారు. అటు రిషబ్ పంత్, అశ్విన్ కూడా గాయాలతో బాధపడుతుండగా.. తాజాగా బౌలర్ జస్ప్రిత్ బుమ్రా కూడా పొత్తి కడుపు నొప్పితో నాలుగో టెస్టుకు దూరం కానున్నడని వార్తలు వస్తున్నాయి. మరి దీనిలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

ఇలా ఒకరి తర్వాత ఒకరు గాయాలపాలవుతుంటే.. నాలుగో టెస్టు జట్టు కూర్పుపై సందిగ్దత ఏర్పడింది. సీనియర్లు అందరికీ గాయాలు.. రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు ఫామ్ లేమి.. మరి చివరి టెస్టులో ఆడేది ఎవరు.? ఇదే ఇప్పుడు అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న.. మయాంక్ అగర్వాల్, కుల్దీప్, నటరాజన్, పృథ్వీ షా, శార్దుల్ ఠాకూర్‌లలో ఎవరిని తీసుకుంటారు.? చివరి టెస్ట్ బుమ్రా ఆడకపోతే.. అతడి స్థానంలో నటరాజన్ అరగేట్రం చేస్తాడు. ఇక పంత్ ప్లేస్‌ను రీప్లేస్ చేసేది సాహా.. మరి జడేజా, అశ్విన్ స్థానాలను భర్తీ చేసేది ఎవరు.?