IND A vs NEP: తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన తిలక్ సేన.. నేపాల్‌పై ఘన విజయం

నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు 306 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత కెప్టెన్ తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర అద్భుత సెంచరీలతో జట్టుకు భారీ స్కోరు అందించగా, అనంతరం ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా నిప్పులు చెరిగే బౌలింగ్‌తో నేపాల్‌ను కేవలం 26 పరుగులకే ఆలౌట్ చేశారు.

IND A vs NEP: తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన తిలక్ సేన.. నేపాల్‌పై ఘన విజయం
India A Vs Nepal

Updated on: Nov 20, 2026 | 9:10 PM

IND A vs NEP: నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించి 306 పరుగుల భారీ తేడాతో ఏకపక్ష విజయాన్ని అందుకుంది.

తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర శతక మోత

తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 332 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆరంభంలోనే ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (26), అభిషేక్ శర్మ (9), ఆయుష్ బదోని (2) త్వరగానే పెవిలియన్ చేరడంతో జట్టు కొంత తడబడింది. ఈ దశలో కెప్టెన్ తిలక్ వర్మ, వికెట్ కీపర్ కుమార్ కుశాగ్ర ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

తిలక్ వర్మ 113 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 107 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు కుమార్ కుశాగ్ర మరింత దూకుడుగా ఆడుతూ కేవలం 102 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 117 పరుగులు బాదాడు. చివర్లో సూర్యాంశ్ షెడ్జ్ కేవలం 14 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 36 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో జట్టు స్కోరు 330 దాటింది. నేపాల్ బౌలర్లలో సందీప్ లమిచానే, లలిత్ రాజ్‌బన్షి తలో మూడు వికెట్లు పడగొట్టగా, నందన్ యాదవ్ రెండు, పవన్ సరాఫ్ ఒక వికెట్ తీశారు.

26 పరుగులకే నేపాల్ చాపచుట్టేసింది!

333 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌కు భారత పేసర్లు చుక్కలు చూపించారు. ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా ధాటికి నేపాల్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. ఫలితంగా ఆ జట్టు కేవలం 11.3 ఓవర్లలోనే 26 పరుగులకు ఆలౌట్ అయింది.

నేపాల్ ఇన్నింగ్స్‌లో ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరును అందుకోలేకపోవడం గమనార్హం. పవన్ సరాఫ్ (6), రషీద్ ఖాన్ (6) ఆ జట్టు తరఫున అత్యధిక స్కోరర్లుగా నిలిచారు. అర్జున్ కుమాల్, కుశాల్ భుర్టెల్, బసిర్ అహ్మద్, లోకేష్ బామ్, కెప్టెన్ సందీప్ లమిచానే ఇలా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు.

భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతను 5 ఓవర్లు వేసి 2 మెయిడిన్లతో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా 6 ఓవర్లలో 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, షాబాజ్ అహ్మద్ పరుగులేమీ ఇవ్వకుండా ఒక వికెట్ దక్కించుకున్నాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us