IPL 2025: ముదురుతున్న SRH, HCA వివాదం! ఉప్పల్ స్టేడియం ఖాళీ చేయనున్న సన్‌రైజర్స్?
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)-హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య టికెట్ వివాదం తీవ్రతరం అవుతోంది. SRH యాజమాన్యం హెచ్‌సీఏ అనుచితంగా ప్రవర్తించిందని, బెదిరింపులకు పాల్పడిందని ఆరోపిస్తూ, హైదరాబాద్‌ను వదిలివెళ్లే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే, హెచ్‌సీఏ ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఎటువంటి అధికారిక సమాచారం తమకు రాలేదని ప్రకటించింది. ఈ వివాదం కొనసాగితే, SRH కొత్త వేదిక కోసం చూస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

IPL 2025 సీజన్ జరుగుతున్న క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)-హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య ఉద్రిక్తత పెరిగింది. మార్చి 30న తెల్లవారుజామున క్రికెట్ ప్రేమికులు నిద్ర లేవగానే SRH టీమ్ రాసిన ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ లేఖలో హెచ్‌సీఏ తమను వేధిస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లు SRH ఆరోపించింది. అంతేగాక, ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే, హైదరాబాద్ నగరాన్నే వదిలి వెళ్లిపోతామని హెచ్చరించింది.
ఈ అంశంపై హెచ్‌సీఏ కూడా తక్షణమే స్పందించింది. SRH చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని హెచ్‌సీఏ స్పష్టం చేసింది. SRH యాజమాన్యం అధికారిక ఈమెయిల్స్ ద్వారా తమకు ఎటువంటి సమాచారం రాలేదని హెచ్‌సీఏ ప్రకటించింది. ఈ లేఖను ఎవరో కావాలనే లీక్ చేసి వివాదం సృష్టిస్తున్నారని హెచ్‌సీఏ పేర్కొంది.
SRH విడుదల చేసిన లేఖ ప్రకారం, గత 12 ఏళ్లుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నా, గత రెండేళ్లుగా హెచ్‌సీఏ నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని SRH పేర్కొంది. ఒప్పందం ప్రకారం హెచ్‌సీఏకి 3900 ఉచిత టికెట్లు అందిస్తోందని, ఇందులో 50 టికెట్లు ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్‌కు కేటాయించారని తెలిపింది. అయితే, ఈ ఏడాది ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్ సామర్థ్యం 30 టికెట్లు మాత్రమే అని, మరొక 20 టికెట్లు అదనంగా ఇవ్వాలని హెచ్‌సీఏ కోరిందని SRH వివరించింది.
ఇప్పటికే స్టేడియం మొత్తం తమ నియంత్రణలోకి వస్తుందని, దీనికి అద్దె కూడా చెల్లిస్తున్నామని SRH పేర్కొంది. కానీ, గత మ్యాచ్‌లో హెచ్‌సీఏ అధికారులు ఎఫ్3 బాక్స్‌కు తాళం వేశారని, అదనంగా 20 ఫ్రీ టికెట్లు ఇవ్వకపోతే తాళం తీసే ప్రసక్తే లేదని బెదిరించారని SRH ఆరోపించింది.
SRH ప్రకటన ప్రకారం, ఇది ఒక్క సంఘటన కాదు. గత రెండు సీజన్లుగా హెచ్‌సీఏ తమ సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, ఈ విషయాన్ని హెచ్‌సీఏ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం రాలేదని SRH తెలిపింది.
SRH లేఖలో మరో సంచలన అంశం ఏమిటంటే, హెచ్‌సీఏ అధ్యక్షుడు కూడా పలుమార్లు బెదిరించారని SRH జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ పేర్కొన్నారు. “హెచ్‌సీఏ ప్రవర్తన చూస్తుంటే, ఈ స్టేడియంలో SRH ఆడేలా చూడకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఇదే నిజమైతే, BCCI, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యంతో చర్చించి, హైదరాబాద్‌ను వదిలి, కొత్త వేదికను చూస్తాం” అని ఆయన హెచ్చరించారు.
SRH లేఖ బయటకు రాగానే హెచ్‌సీఏ తక్షణమే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. SRH నుంచి తమ అధికారిక ఈమెయిల్స్‌కి ఎలాంటి సమాచారం రాలేదని హెచ్‌సీఏ ప్రకటించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని, ఈమెయిల్స్‌కి సంబంధించిన పూర్తి విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఒకవేళ ఈమెయిల్స్ నిజమైనవైతే, అవి అధికారికంగా కాకుండా గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా లీక్ చేయబడ్డాయని, ఇది SRH-HCA ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్ర అని హెచ్‌సీఏ ఆరోపించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..