FIFA World Cup 2026 : హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అయిన మెస్సీ.. 96 ఏళ్ల వరల్డ్ కప్ రికార్డు బద్దలవ్వడం ఖాయమా?

FIFA World Cup 2026 : జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. అత్యధిక గోల్స్ రికార్డు కు అతను చాలా దగ్గరగా ఉన్నాడు.

FIFA World Cup 2026 : హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అయిన మెస్సీ.. 96 ఏళ్ల వరల్డ్ కప్ రికార్డు బద్దలవ్వడం ఖాయమా?
Lionel Messi

Updated on: Jun 05, 2026 | 7:59 PM

FIFA World Cup 2026 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 మహాసంగ్రామానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జూన్ 11 నుంచి ఈ మెగా టోర్నమెంట్ అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఈసారి ఫుట్‌బాల్ చరిత్రలోనే మొదటిసారిగా యూఎస్‌ఏ, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. విశ్వవిజేతగా నిలిచేందుకు ప్రపంచ నలుమూలల నుంచి రికార్డు స్థాయిలో 48 జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. ఈ ఫుట్‌బాల్ పండగలో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడాకారులు లైనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలతో పాటు ఫ్రాన్స్ యువ సంచలనం కిలియన్ ఎంబాప్పే వంటి టాప్ ప్లేయర్లు తమ దేశాల తరఫున బరిలోకి దిగుతున్నారు. దాదాపు 96 ఏళ్ల చరిత్ర కలిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఎందరో ఆటగాళ్లు రికార్డులు సృష్టించారు. అయితే ఈ 2026 వరల్డ్ కప్‌లో అర్జెంటీనా లెజెండ్ లైనల్ మెస్సీ ఒక అసాధారణమైన చారిత్రాత్మక రికార్డును బద్దలు కొట్టే ముంగిట నిలిచాడు.

వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ రికార్డ్ ఎవరిదంటే?

ఫిఫా ప్రపంచకప్ సుదీర్ఘ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఒక్క ఆటగాడు కూడా కనీసం 20 గోల్స్ మార్కును అందుకోలేకపోయాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు జర్మనీకి చెందిన మిరోస్లావ్ క్లోజ్ (16 గోల్స్) పేరిట ఉంది. బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో నాజారియో 15 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మన లైనల్ మెస్సీ ఇప్పటివరకు ఆడిన ప్రపంచకప్ మ్యాచుల్లో మొత్తం 13 గోల్స్ చేసి ఈ ఆల్‌టైమ్ లిస్టులో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

చరిత్ర సృష్టించడానికి మెస్సీకి కావాల్సింది జస్ట్ 4 గోల్స్

2026 లో మెస్సీ తన కెరీర్‌లో ఆరో ప్రపంచకప్‌ను ఆడబోతున్నాడు. ఇప్పటివరకు వరల్డ్ కప్‌లలో అత్యధికంగా 26 మ్యాచ్‌లు ఆడిన అనుభవం మెస్సీకి ఉంది. ఈ 2026 టోర్నమెంట్‌లో మెస్సీ గనుక మరో 4 గోల్స్ సాధిస్తే.. అతను 17 గోల్స్‌తో ఫిఫా వరల్డ్ కప్ 96 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఏకైక నంబర్ వన్ ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. మెస్సీ ప్రస్తుతమున్న సూపర్ ఫామ్ చూస్తుంటే ఈ మైలురాయిని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

రేసులో వెనుకబడ్డ క్రిస్టియానో రొనాల్డో

మెస్సీకి సమకాలీన ఆటగాడిగా, గట్టి పోటీదారుడిగా భావించే పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈ ఆల్‌టైమ్ టాప్ గోల్ స్కోరర్ల లిస్టులో చాలా వెనుకబడి ఉన్నాడు. రొనాల్డో ఇప్పటివరకు 6 వరల్డ్ కప్‌లలో 22 మ్యాచ్‌లు ఆడినప్పటికీ కేవలం 8 గోల్స్ మాత్రమే చేయగలిగాడు. దీంతో అత్యధిక గోల్స్ చేసిన వారి జాబితాలో రొనాల్డో పేరు టాప్ రేసులో ఎక్కడా కనిపించడం లేదు.

మెస్సీ రికార్డుకు ఎసరు పెడుతున్న యంగ్ గన్ ఎంబాప్పే

మరోవైపు ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాప్పే చాలా వేగంగా దూసుకుపోతున్నాడు. కేవలం 27 ఏళ్ల వయస్సులోనే అతను ప్రపంచకప్‌లలో ఏకంగా 12 గోల్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గత 2022 వరల్డ్ కప్‌లోనే ఎంబాప్పే ఏకంగా 8 గోల్స్ కొట్టి సంచలనం సృష్టించాడు. జర్మనీ ప్లేయర్ క్లోజ్ రికార్డును బద్దలు కొట్టడానికి ఎంబాప్పేకు కేవలం 5 గోల్స్ మాత్రమే అవసరం. ఈ టోర్నీలో మెస్సీ, ఎంబాప్పేలలో ఎవరు సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పుతారో చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us