CWG 2026: ఘనంగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. 39 పతకాలతో భారత్ సరికొత్త చరిత్ర..!
Commonwealth Games 2026 Final Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026 ఘనంగా ముగిశాయి. కాగా భారత జట్టు 39 పతకాలతో (13 స్వర్ణాలు, 17 రజతాలు, తొమ్మిది కాంస్యాలు) నాలుగో స్థానంలో ఉంది. ఇక 2030లో శత వార్షికోత్సవానికి ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
Commonwealth Games 2026 Final Medal Tally: గ్లాస్గో వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో అదరగొట్టారు. షూటింగ్, కుస్తీ వంటి మన సాంప్రదాయ పతకాల క్రీడలు ఈసారి టోర్నీలో లేకపోయినా మన బాక్సర్లు, వెయిట్‌లిఫ్టర్లు, పారా అథ్లెట్లు అద్భుతాలు సృష్టించారు. ఏకంగా 39 పతకాలు కొల్లగొట్టి పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది.
బాక్సింగ్ రింగ్‌లో భారత్ సరికొత్త రికార్డు..!
ఈసారి కామన్వెల్త్ పోరులో భారత బాక్సింగ్ దళం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రింగ్‌లోకి దిగిన మన పంచ్ వీరులు ఏకంగా 7 స్వర్ణాలు, 3 రజతాలతో కలిపి 10 పతకాలు సాధించి టోర్నమెంట్కే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. జైస్మిన్ లంబోరియా, సచిన్ సివాచ్, అంకుష్ పంఘాల్, సాక్షి చౌదరి, ప్రీతి పవార్, ప్రియ, అరుంధతి చౌదరి బంగారు పంచ్‌లతో భారత్‌కు పతకాల పంట పండించారు. లవ్లీనా బొర్గోహైన్, జడుమణి సింగ్, నరేందర్ బెర్వాల్ రజత పతకాలతో మెరిశారు.
పోటీల ముగింపు నాటికి భారత్ ఖాతాలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు చేరాయి. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా 70 స్వర్ణాలు, 45 రజతాలు, 56 కాంస్యాలతో కలిపి మొత్తం 171 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ 110 పతకాలతో రెండో స్థానంలో, కెనడా 62 పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి. స్కాట్లాండ్ కూడా భారత్‌తో సమానంగా 39 పతకాలే సాధించినప్పటికీ, మనకు ఎక్కువ రజత పతకాలు ఉండటంతో భారత్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది.
ట్రాక్ అండ్ ఫీల్డ్ లో నీరజ్, గుల్వీర్ జోరు..!
ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడల్లో కూడా భారత అథ్లెట్లు అద్భుతంగా రాణించారు. పురుషుల జావెలెన్ త్రో విభాగంలో ఒలింపిక్ హీరో నీరజ్ చోప్రా రజత పతకం సాధించగా, యష్ వీర్ సింగ్ కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. లాంగ్ జంప్‌లో మురళి శ్రీశంకర్, ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్ రజతాలు సాధించారు. గుల్వీర్ సింగ్ 10,000 మీటర్ల రేసులో రజతం, 5,000 మీటర్ల పరుగులో కాంస్యం సాధించి ఒకే కామన్వెల్త్ ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన అరుదైన అథ్లెట్‌గా నిలిచాడు. డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ కాంస్యం సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు.
పారా అథ్లెటిక్స్ విభాగంలో దిలీప్ మహదు గావిత్, సోమన్ రాణా, షర్మిల బంగారు పతకాలు సాధించి సరికొత్త చరిత్ర తిరగరాశారు. జూడోలో అస్మిత డే, హర్ష్ సింగ్ దేశానికి చారిత్రాత్మక స్వర్ణాలు అందించగా, యామిని మౌర్య రజతం దక్కించుకుంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను వరుసగా మూడోసారి కామన్వెల్త్ స్వర్ణం సాధించి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. మొత్తానికి మన క్రీడాకారులు అసాధారణ ప్రతిభతో భారత్ కీర్తి పతాకాన్ని గ్లాస్గోలో రెపరెపలాడించారు.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత పతక విజేతల పూర్తి జాబితా..
ఝందు కుమార్ – కాంస్యం – పారా పవర్ లిఫ్టింగ్ (పురుషుల హెవీవెయిట్)
కామన్వెల్త్ గేమ్స్ 2026 తుది పతకాల పట్టిక..
ర్యాంక్
దేశం
బంగారం
వెండి
కాంస్యం
మొత్తం
1
ఆస్ట్రేలియా
70
45
56
171
2
ఇంగ్లాండ్
29
45
36
110
3
కెనడా
19
20
23
62
4
భారతదేశం
13
17
9
39
5
స్కాట్లాండ్
13
9
17
39
6
న్యూజిలాండ్
10
14
12
36
7
నైజీరియా
10
7
7
24
8
జమైకా
10
4
5
19
9
వేల్స్
9
10
12
31
10
మలేషియా
8
3
5
16
ముఖ్యమైన క్రీడలు లేకపోయినా భారత క్రీడాకారులు చూపిన ఈ పోరాట పటిమ క్రీడా ప్రపంచాన్ని తీవ్రంగా ఆకట్టుకుంది. రాబోయే ఆసియన్ గేమ్స్, ఇతర అంతర్జాతీయ టోర్నీల్లో భారత అథ్లెట్లు మరిన్ని సంచలనాలు సృష్టిస్తారనడంలో సందేహం లేదు.