అప్పుడు టీమిండియాపై జీరో.. ఇప్పుడు 38 బంతుల్లో హీరో.. మ్యాచ్‌ను మడతెట్టేసిన మంచోడు.. ఎవరంటే.?

భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ పేలవ ప్రదర్శన కనబరిచి వార్తల్లో నిలిచిన జాక్ క్రాలీ.. ఇప్పుడు ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. ఓపెనర్‌గా వచ్చిన క్రాలీ కేవలం 38 బంతుల్లోనే అద్భుతమైన ఆట ఆడాడు. జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.

అప్పుడు టీమిండియాపై జీరో.. ఇప్పుడు 38 బంతుల్లో హీరో.. మ్యాచ్‌ను మడతెట్టేసిన మంచోడు.. ఎవరంటే.?
Telugu News

Updated on: Aug 21, 2025 | 11:54 AM

ఇంగ్లాండ్‌లో ‘ది హండ్రెడ్’ టోర్నమెంట్ మ్యాచ్‌లు శరవేగంగా సాగుతున్నాయ్. ఇందులో ఆగస్టు 20న లండన్ స్పిరిట్, నార్తర్న్ సూపర్‌చార్జర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు బరిలోకి దిగినప్పటికీ.. జాక్ క్రాలీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. జాక్ క్రాలీ తన పదునైన బ్యాటింగ్‌తో అతడి జట్టు నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌ను విజయపథంలో నడిపించాడు. ఈ మ్యాచ్‌లో, లండన్ స్పిరిట్ 8 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

వార్నర్-విలియమ్సన్ విఫలం..

ఈ మ్యాచ్‌లో లండన్ స్పిరిట్ మొదట బ్యాటింగ్ చేసింది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఆ జట్టు పూర్తిగా నిరాశపరిచింది. నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌పై డేవిడ్ వార్నర్ తన ఖాతాను కూడా తెరవలేకపోయాడు. కేన్ విలియమ్సన్ కేవలం 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీని తర్వాత, ఓల్లీ పోప్ అజేయంగా 52 పరుగులు చేశాడు. దీంతో లండన్ స్పిరిట్ 100 బంతుల్లో 135 పరుగులు చేయగలిగింది.

విజయంతో జాక్ క్రాలీ..

నార్తర్న్ సూపర్‌చార్జర్స్ 136 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించగలిగింది. దీనికి జాక్ క్రాలీ, డేవిడ్ మలన్ సహాయం చేశారు. ఈ ఇద్దరు ఓపెనర్లు మొదటి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. దీని తర్వాత డేవిడ్ మలన్ అవుట్ కాగా.. జాక్ క్రాలీ ఒక ఎండ్ నుంచి పరుగుల వరద పారించాడు. తన ఇన్నింగ్స్‌లో 38 బంతులు ఎదుర్కొని అజేయంగా 55 పరుగులు చేశాడు. 66 నిమిషాల పాటు కొనసాగిన ఈ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలీ స్ట్రైక్ రేట్ 144.73 కాగా.. మొత్తం 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో లండన్ స్పిరిట్.. నాలుగో ఓటమిని చవిచూసింది. అటు నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు ఇది నాల్గవ విజయం. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌కు జాక్ క్రాలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.