Youngest Cricketers : ప్రమాదంలో సచిన్ రికార్డ్.. అత్యంత చిన్న వయసులోనే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన టాప్ 5 ప్లేయర్స్ వీళ్లే

Youngest Cricketers : భారత క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. వైభవ్ సూర్యవంశీ త్వరలో ఈ రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఉంది. ఈ జాబితాలో పార్థివ్ పటేల్, పీయూష్ చావ్లా కూడా ఉన్నారు.

Youngest Cricketers : ప్రమాదంలో సచిన్ రికార్డ్.. అత్యంత చిన్న వయసులోనే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన టాప్ 5 ప్లేయర్స్ వీళ్లే
Youngest Cricketers

Updated on: Jun 08, 2026 | 7:13 PM

Youngest Cricketers : భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఒక సరికొత్త సంచలనం ఊపేస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ 237.30 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించి, కేవలం 15 ఏళ్ల 65 రోజుల వయసులోనే ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లే ఇండియా ‘ఎ’ జట్టులో చోటు దక్కించుకున్న ఈ కుర్రాడు.. త్వరలోనే సీనియర్ టీమిండియాలోకి వస్తే భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు భారత్ తరఫున అత్యంత చిన్న వయసులో డెబ్యూ చేసిన టాప్ 5 ఆటగాళ్లెవరో ఓ లుక్కేద్దాం.

5) మణీందర్ సింగ్ (17 ఏళ్ల 193 రోజులు)

ఈ లిస్ట్‌లో ఐదో స్థానంలో మాజీ స్పిన్నర్ మణీందర్ సింగ్ ఉన్నాడు. బిషన్ సింగ్ బేడీకి సరైన వారసుడిగా పేరొందిన మణీందర్.. 1982లో పాకిస్తాన్‌పై కరాచీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా తన 17వ ఏట అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం, మణీందర్‌కు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడం ఒక చేదు జ్ఞాపకం. ఆ తర్వాత కెరీర్‌లో ఫామ్ కోల్పోవడంతో అతను ఎక్కువ కాలం జట్టులో కొనసాగలేకపోయాడు.

4) పీయూష్ చావ్లా (17 ఏళ్ల 75 రోజులు)

ఇక నాలుగో స్థానంలో లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా నిలిచాడు. 2005 ఛాలెంజర్ ట్రోఫీలో కేవలం 16 ఏళ్ల వయసులోనే సచిన్ టెండూల్కర్‌ను తన మేజికల్ గూగ్లీతో బౌల్డ్ చేసి చావ్లా దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలతో కలిసి అండర్-19 వరల్డ్ కప్ ఆడిన పీయూష్.. 2006లో ఇంగ్లాండ్‌పై మొహాలీ టెస్ట్ ద్వారా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. జూన్ 2025లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే సమయానికి అతను భారత్ తరఫున ఎన్నో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడాడు.

3) లక్ష్మణ్ శివరామకృష్ణన్ (17 ఏళ్ల 118 రోజులు)

ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచిన ఆటగాడు ఎల్. శివరామకృష్ణన్. 1983 ఏప్రిల్ 27న వెస్టిండీస్‌తో యాంటిగ్వాలో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా ఇతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో అత్యంత చిన్న వయసులో డెబ్యూ చేసిన ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత 1984-85 లో ఇంగ్లాండ్‌తో జరిగిన హోమ్ సిరీస్‌లో బొంబాయి వేదికగా ఒకే మ్యాచ్‌లో 12 వికెట్లు తీసి, సిరీస్ మొత్తంలో 23 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

2) పార్థివ్ పటేల్ (17 ఏళ్ల 152 రోజులు)

రెండో స్థానంలో గుజరాత్ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ నిలిచాడు. 2002 ఆగస్టు 8న ఇంగ్లాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ద్వారా పార్థివ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. డెబ్యూ మ్యాచ్ చివరి రోజున దాదాపు గంటకు పైగా క్రీజులో నిలబడి భారత్ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఎంఎస్ ధోనీ రాకతో జట్టులో అవకాశాలు తగ్గినప్పటికీ, డొమెస్టిక్ క్రికెట్‌లో పార్థివ్ అద్భుతమైన కెరీర్‌ను సాగించి 2020 లో రిటైర్ అయ్యాడు.

1) సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 205 రోజులు)

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రికార్డు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట చెక్కుచెదరకుండా ఉంది. 1989 నవంబర్ 15న పాకిస్తాన్‌పై కరాచీ టెస్ట్ ద్వారా సచిన్ 16 ఏళ్ల ప్రాయంలోనే భారత్ తరఫున బరిలోకి దిగాడు. ఆ సిరీస్‌లోని నాలుగో టెస్టులో వకార్ యూనిస్ వేసిన బౌన్సర్ తగిలి ముక్కు నుంచి రక్తం కారుతున్నా.. మై ఖేలుంగా(నేను ఆడుతా) అంటూ పట్టుదలగా బ్యాటింగ్ చేసి సచిన్ అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆ తర్వాత 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 100 అంతర్జాతీయ సెంచరీలు, టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డులతో క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాడిగా నిలిచిపోయాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో వైభవ్ సూర్యవంశీ గనుక సీనియర్ జట్టుకు ఆడితే, సచిన్ పేరిట ఉన్న ఈ 37 ఏళ్ల నాటి అరుదైన రికార్డు బద్దలవుతుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us