
WPL 2026: మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో అభిమానులకు అసలైన మజా లభించింది. నవీ ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై 10 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. టాస్ గెలిచిన యూపీ వారియర్స్ మొదట బౌలింగ్ ఎంచుకోగా, గుజరాత్ బ్యాటర్లు వారి నిర్ణయాన్ని తలకిందులు చేస్తూ భారీ స్కోరు సాధించారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో బ్యాటర్ల ఆధిపత్యమే కనిపించింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. కెప్టెన్ ఆష్లే గార్డనర్ ముందుండి జట్టును నడిపించింది. కేవలం 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ(52 పరుగులు) పూర్తి చేసుకుని యూపీ బౌలర్లకు చుక్కలు చూపించింది. అంతకుముందు ఓపెనర్లు సోఫీ డివైన్ (30), బెత్ మూనీ (13) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, యువ సంచలనం అనుష్క శర్మ (44) తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. 15 ఓవర్లకే 150 మార్కును దాటేసిన గుజరాత్, యూపీ ముందు భారీ టార్గెట్ ఉంచింది.
208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 10 పరుగులకే తొలి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ మెగ్ లానింగ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా, 74 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోవడంతో యూపీ పరిస్థితి ఆశాజనకంగా కనిపించలేదు. ఈ దశలో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ మైదానంలో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయింది. విధ్వంసకర హాఫ్ సెంచరీతో గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. 14 ఓవర్లకు 132 పరుగులు చేసిన యూపీ ఒక దశలో గెలిచేలా కనిపించినా, 155 పరుగుల వద్ద లిచ్‌ఫీల్డ్ అవుట్ కావడంతో మ్యాచ్ మళ్ళీ గుజరాత్ వైపు తిరిగింది.
చివరి 6 బంతుల్లో యూపీ విజయానికి 26 పరుగులు అవసరమవ్వగా, గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి యూపీ వారియర్స్ 8 వికెట్ల నష్టానికి 197 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 10 పరుగుల స్వల్ప తేడాతో గుజరాత్ జెయింట్స్ ఈ సీజన్‌లో తన మొదటి విజయాన్ని నమోదు చేసింది. యూపీ బ్యాటర్లలో లిచ్‌ఫీల్డ్ పోరాటం వృథా అయినప్పటికీ, ప్రేక్షకులకు మాత్రం సిసలైన టీ20 వినోదం లభించింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో గుజరాత్ బౌలర్ల వ్యూహం పక్కాగా అమలు కావడంతో భారీ స్కోరును కాపాడుకోగలిగారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..