
WPL 2026 Final : వడోదరలోని బీసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణయం ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ధాటికి తలకిందులైనట్లు కనిపిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోరు సాధించి, ఆర్‌సీబీ ముందు 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా లిజెల్ లీ (37) ఆరంభంలోనే సయాలి సత్ఘరే వేసిన ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ (20) తక్కువ స్కోరుకే అవుట్ అయినప్పటికీ, కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. జెమిమా కేవలం 32 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేసి తన క్లాస్ చూపించింది.
జెమిమా అవుట్ అయిన తర్వాత కూడా ఢిల్లీ పరుగుల వేగం తగ్గలేదు. లారా వోల్వార్డ్,షెనెల్లే హెన్రీ ఆర్‌సీబీ బౌలర్లను టార్గెట్ చేస్తూ భారీ షాట్లు ఆడారు. 18 ఓవర్లకే 164 పరుగులు చేసిన ఢిల్లీ, చివరి రెండు ఓవర్లలో మరింత దూకుడు ప్రదర్శించి స్కోరును 200 దాటించింది. లారా వూల్‌వార్డ్ట్ 44 పరుగులు చేయగా, షెనెల్లే హెన్రీ 15 బంతుల్లో అజేయంగా 35 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో లారెన్ బెల్ 4 ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ, మిగిలిన వారు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అరుంధతి రెడ్డి ఒక వికెట్ తీసినా 40 పరుగులు ఇచ్చింది.
వడోదరలోని కోటంబి స్టేడియం పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇక్కడ 160 పరుగుల స్కోరును ఛేజ్ చేయడమే గగనంగా ఉన్న తరుణంలో, ఆర్‌సీబీ ముందు ఏకంగా 204 పరుగుల లక్ష్యం ఉంది. అంటే ప్రతి ఓవర్‌కు 10 పరుగులకు పైగా రేటుతో బ్యాటింగ్ చేయాలి. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ ప్రభావం ఉంటే బ్యాటింగ్‌కు కొంచెం వెసులుబాటు దొరికే అవకాశం ఉందని కెప్టెన్ స్మృతి మంధాన ఆశిస్తోంది.
ఇప్పుడు అంతా స్మృతి మంధాన, గ్రేస్ హారిస్ చేతుల్లోనే ఉంది. ఆర్‌సీబీ వరుసగా రెండో టైటిల్ గెలవాలంటే పవర్‌ప్లేలో భారీగా పరుగులు రాబట్టాలి. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మరిజన్నే కాప్, స్నేహ రాణా, మిన్ను మణిలు ఆర్‌సీబీని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ వరుసగా మూడు సార్లు ఫైనల్లో ఓడిపోయింది, ఈసారి 203 పరుగుల భారీ స్కోరుతో తమ మొదటి టైటిల్‌ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి