Womens T20 World Cup 2026 : నాలుగు బంతుల్లో మూడు క్యాచ్‌లు డ్రాప్.. మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘోర ఫీల్డింగ్

Womens T20 World Cup 2026 : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా భారత మహిళల జట్టు ఘోర ఫీల్డింగ్ చేసింది. కేవలం నాలుగు బంతుల్లో మూడు క్యాచ్‌లు వదిలేసి అన్‌వాంటెడ్ రికార్డు నమోదు చేసింది. పవర్‌ప్లేలో నాలుగు క్యాచ్‌లు డ్రాప్ చేసి విమర్శలు ఎదుర్కొంటోంది.

Womens T20 World Cup 2026 : నాలుగు బంతుల్లో మూడు క్యాచ్‌లు డ్రాప్.. మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘోర ఫీల్డింగ్
Womens T20 World Cup 2026

Updated on: Jun 26, 2026 | 9:50 AM

Womens T20 World Cup 2026 : మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌లో భారత మహిళల క్రికెట్ జట్టును ఫీల్డింగ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ప్రతిష్టాత్మక మ్యాచుల్లో క్యాచ్‌లు వదిలేస్తూ ప్రత్యర్థి జట్లకు అనవసరమైన లైఫ్‌లు ఇస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్ మహిళల జట్టుతో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా భారత ఫీల్డర్లు అదే తప్పును పునరావృతం చేశారు. లూజ్ ఫీల్డింగ్‌తో సులువైన క్యాచ్‌లను చేతులారా వదిలేసి మ్యాచ్‌ను కష్టాల్లోకి నెట్టారు. ఈ టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్లు మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసే అవకాశాలను సృష్టించినప్పటికీ, ఫీల్డర్లు మాత్రం వారికి అస్సలు సహకరించలేదు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే అంటే పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేలోపే భారత ఫీల్డర్లు ఏకంగా నాలుగు ఈజీ క్యాచ్‌లను నేలపాలు చేశారు. ఇందులో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, కేవలం నాలుగు బంతుల వ్యవధిలోనే మూడు క్యాచ్‌లను డ్రాప్ చేసి ప్రత్యర్థి బ్యాటర్లకు పెద్ద ఊరటనిచ్చారు.

భారత జట్టు చేసిన మొదటి పెద్ద తప్పు ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే జరిగింది. యువ బౌలర్ శ్రీ చరణి వేసిన బంతిని బంగ్లాదేశ్ బ్యాటర్ జువైరియా ఫిర్దౌస్ గాల్లోకి లేపింది. అయితే వికెట్ కీపర్ యాస్తికా భాటియా ఆ సులువైన క్యాచ్‌ను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఆ తర్వాత నాలుగో ఓవర్ చివరి బంతికి కూడా అదే బ్యాటర్ జువైరియా ఇచ్చిన క్యాచ్‌ను రాధా యాదవ్ వదిలేసింది. ఆమె చేతుల్లో పడిన బంతి కాస్తా జారి నేరుగా బౌండరీ లైన్ దాటి నాలుగు పరుగులగా మారడం గమనార్హం.

మ్యాచ్‌లో ఐదో ఓవర్ సాగుతున్న సమయంలో భారత ఫీల్డింగ్ విన్యాసాలు చూసి స్టేడియంలోని అభిమానులు సైతం ముక్కున వేలేసుకున్నారు. శ్రీ చరణి వేసిన రెండో బంతికి సోభనా మోస్తరి ఇచ్చిన క్యాచ్‌ను కవర్స్ పొజిషన్‌లో నిలబడిన నందిని శర్మ వదిలేసింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వెంటనే నందినిని షార్ట్ థర్డ్ మ్యాన్ స్థానానికి మార్చింది. కానీ, దురదృష్టవశాత్తూ తదుపరి బంతికే మళ్లీ నందిని వైపే ఒక సింపుల్ క్యాచ్ వచ్చింది. దాన్ని కూడా ఆమె చేతులారా వదిలేయడంతో ఒకే ఓవర్లో బ్యాక్-టు-బ్యాక్ రెండు జీవన్మరణాలు లభించాయి.

ఈ ఘోర ఫీల్డింగ్ ప్రదర్శనతో భారత మహిళల జట్టు టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒక అన్ వాంటెడ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ 2026 ప్రపంచకప్‌లోనే పవర్‌ప్లే సమయంలో ఒక జట్టు మూడు లేదా అంతకంటే ఎక్కువ క్యాచ్‌లు వదిలేయడం ఇది రెండోసారి. విశేషం ఏంటంటే ఈ రెండు సార్లు కూడా ఆ రికార్డు భారత్ పేరిటే నమోదైంది. ఇంతకుముందు పాకిస్తాన్‌తో జరిగిన పోరులోనూ టీమిండియా పవర్‌ప్లేలోనే మూడు క్యాచ్‌లు టెన్షన్‌లో వదిలేసింది.

మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే, పవర్‌ప్లే ఆరు ఓవర్లలోనే నాలుగు క్యాచ్‌లు వదిలేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఏప్రిల్ 2026 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మహిళల జట్టు పవర్‌ప్లేలోనే నాలుగు క్యాచ్‌లు వదిలేసి మొదటి స్థానంలో నిలవగా, ఇప్పుడు భారత్ ఆ చెత్త రికార్డులో బంగ్లాదేశ్ సరసన చేరింది. రాబోయే పెద్ద మ్యాచుల్లోనైనా భారత్ ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us