
Ishan Kishan : రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో కివీస్ బౌలర్లను ఉతికేసి, టీమిండియాను గెలుపు బాటలో నడిపించిన ఇషాన్ కిషన్ (76)పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కేవలం 32 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన ఈ యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇన్నింగ్స్ చూసి అంతా ఫిదా అయ్యారు. అయితే, మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇషాన్ కిషన్‌పై కాస్త గుర్రుగా ఉన్నాడట. 209 పరుగుల లక్ష్య ఛేదనలో అంత అద్భుతంగా ఆడినా సూర్యకు ఎందుకు కోపం వచ్చిందో తెలిస్తే మీరు నవ్వుకుంటారు.
రాయ్‌పూర్ టీ20లో 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ కేవలం 6 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ కివీస్ ఫీల్డర్లను ఉరుకులు పరుగులు పెట్టించాడు. ఎంతలా అంటే, పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ స్కోరు 75కు చేరగా, అందులో అత్యధిక పరుగులు ఇషాన్ వే కావడం విశేషం.
అయితే ఈ సుడిగాలి ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎక్కువగా నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లోనే ఉండిపోయాడు. ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నంత సేపు దాదాపు ప్రతి ఓవర్‌లో మెజారిటీ బంతులు అతనే ఆడాడు. వీరిద్దరి మధ్య 43 బంతుల్లో 122 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు కాగా, అందులో ఇషాన్ కిషన్ 31 బంతులు ఎదుర్కొని 76 పరుగులు బాదేశాడు. సూర్యకు కేవలం 12 బంతులు మాత్రమే ఆడే అవకాశం దక్కింది, అందులో అతను 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తనకి బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా ఇషాన్ మొత్తం కవర్ చేసేయడంతో సూర్యకు కాస్త చిరాకు వేసిందట.
మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్య సరదాగా ఈ విషయాన్ని పంచుకున్నాడు. “నిజం చెప్పాలంటే.. ఇషాన్ పవర్ ప్లేలో నాకు అసలు స్ట్రైక్ ఇవ్వడం లేదని అతనిపై నాకు చాలా కోపం వచ్చింది. కానీ అతను ఆడుతున్న తీరు చూసి తర్వాత శాంతించాను. పరిస్థితులను అర్థం చేసుకుని అతను అద్భుతంగా ఆడాడు. నేను నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేశాను, మంచి బ్రేక్ తర్వాత రావడం వల్ల నాలోనూ ఉత్సాహం ఉంది. మొత్తానికి గెలిచినందుకు సంతోషంగా ఉంది” అని సూర్య నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
సూర్య సరదాగా కోపం అని అన్నా.. నిజానికి ఈ విజయంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుందో అర్థమవుతోంది. ఇషాన్ కిషన్ 10వ ఓవర్లో అవుట్ అయిన తర్వాత, సూర్య రంగంలోకి దిగి తన 360 డిగ్రీల షాట్లతో మ్యాచ్‌ను ముగించాడు. 37 బంతుల్లో 82 పరుగులు చేసి సూర్య అజేయంగా నిలవడంతో భారత్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇషాన్ కిషన్ పోరాట పటిమ చూసి నెటిజన్లు కూడా నిజమైన టీమ్ ప్లేయర్ అంటూ సోషల్ మీడియాలో పొగుడుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..