
Ind Vs Ire : భారత టి20 జట్టు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రస్థానం ఊహించని ఓటమితో ప్రారంభమైంది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు ముందు వరకు, టీమిండియా ఆ జట్టు చేతిలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కానీ ఇప్పుడు ఏకంగా రెండు మ్యాచ్‌లతో పాటు సిరీస్‌ను కూడా పూర్తిగా చేజార్చుకుంది. 2026 టి20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కూడా భారత జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావించింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ తాజా ఫలితం భారత క్రికెట్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందిస్తూ, ఇది భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాభవాలలో ఒకటి అని మండిపడ్డారు.
భారత జట్టు ఓడిపోవడం కంటే, ఆటగాళ్లు మైదానంలో ప్రదర్శించిన వైఖరి తనను తీవ్రంగా బాధించిందని గవాస్కర్ పేర్కొన్నారు. ‘జూన్ 28, ఆదివారం అనేది భారత క్రికెట్ చరిత్రలో ఒక అత్యంత చెత్త రోజుగా మిగిలిపోతుంది. క్రికెట్‌లో మ్యాచ్‌లు ఓడిపోవడం సహజమే, కానీ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఎవరి చేతిలో ఓడిపోయాం అనేది ముఖ్యం. భారత క్రికెట్‌లో నేను కూడా కొన్ని పరాజయాలను చూశాను, వాటిలో భాగమయ్యాను. కానీ ఐర్లాండ్ లాంటి జట్టు చేతిలో సిరీస్ ఓడిపోవడం నిజంగా అవమానకరం. ఐర్లాండ్ ఏమైనా అద్భుతమైన క్రికెట్ ఆడి మనల్ని ఓడించిందా అంటే అదీ లేదు. కేవలం మన ఆటగాళ్లలో ఉన్న అతివిశ్వాసం, బాధ్యతారాహిత్యమే భారత్‌ను ముంచేసింది’ అని ఆయన కడిగిపారేశారు.
ఈ ఓటమిని గవాస్కర్ 1983 ప్రపంచకప్ ఫైనల్‌తో పోల్చారు. ఆనాడు వెస్టిండీస్ జట్టు కూడా ఇలాగే అతివిశ్వాసంతో ఆడి భారత్ చేతిలో బోల్తా పడిందని గుర్తు చేశారు. ‘1983 ఫైనల్లో భారత బౌలర్లు చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశారు, కపిల్ దేవ్ అద్భుతమైన క్యాచ్‌తో వివ్ రిచర్డ్స్‌ను అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఆ రోజు వెస్టిండీస్ బ్యాటర్లు ఎంత నిర్లక్ష్యంగా ఆడి అవుట్ అయ్యారో, ఇప్పుడు ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత బ్యాటర్లు అదే తరహా నిర్లక్ష్యాన్ని, అతివిశ్వాసాన్ని ప్రదర్శించారు’ అని గవాస్కర్ విమర్శించారు.
రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ (ఛేజింగ్) ఎంచుకుంది. మొదటి మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు 20 ఓవర్లలో 154/8 పరుగులు చేయగా, భారత్ కేవలం ఒక్క పరుగు తేడాతో విజయాన్ని చేజార్చుకుంది. ఏ క్రీడలోనైనా, ముఖ్యంగా క్రికెట్‌లో పిచ్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం చాలా ముఖ్యం. కానీ మన భారత బ్యాటర్లు మాత్రం పిచ్‌లపై ఉన్న అదనపు బౌన్స్, క్యారీని అంచనా వేయకుండా, తమ పాత ఇమేజ్‌ను కాపాడుకోవాలనే తాపత్రయంతో అనవసరపు షాట్లు ఆడి చాలా సులభంగా వికెట్లను సమర్పించుకున్నారని గవాస్కర్ విశ్లేషించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..