
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో మ్యాచ్ మ్యాచ్‌కూ డీఆర్ఎస్ వివాదాలు ముదురుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎల్బీడబ్ల్యూ రివ్యూల సమయంలో థర్డ్ అంపైర్ స్క్రీన్‌పై అంపైర్స్ కాల్ అని రావడం, దాని వల్ల ఫలితాలు మారిపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రివ్యూ తీసుకున్నదే అంపైర్ తప్పును సరిదిద్దడానికి కదా.. మళ్లీ అంపైర్స్ కాల్ ఇవ్వడం ఏంటి?” అనేది సగటు క్రికెట్ అభిమాని ప్రశ్న. అసలు ఈ నియమం వెనుక ఉన్న అసలైన సైన్స్, ఐసీసీ లాజిక్ ఏంటో చాలా మందికి తెలియదు.
DRSలో ఎల్బీడబ్ల్యూ నిర్ణయాల కోసం హాక్-ఐ లేదా బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని వాడుతుంటారు. మైదానం చుట్టూ ఉండే హై స్పీడ్ కెమెరాల డేటా ఆధారంగా ఈ సాఫ్ట్‌వేర్ పనిచేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే.. బంతి బ్యాటర్ ప్యాడ్‌కు తగిలిన క్షణం వరకే కెమెరాలు రికార్డ్ చేయగలవు. ఆ తర్వాత ఒకవేళ ప్యాడ్ లేకపోతే బంతి వెళ్లి స్టంప్స్‌కు తగులుతుందా లేదా అనేది సాఫ్ట్‌వేర్ ఊహించే అంశం మాత్రమే. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎంత పకడ్బందీగా ఉన్నా.. గాలి వేగం, పిచ్‌పై ఉండే తేమ, బౌన్స్ వంటి సహజ సిద్ధమైన మార్పుల వల్ల ఈ అంచనాలో మిల్లీమీటర్ల స్థాయిలో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉండే అవకాశం ఉంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం.. బాల్ ట్రాకింగ్ టెక్నాలజీలో పూర్తి ఖచ్చితత్వం ఉండాలి అంటే బంతి పరిమాణంలో సగం కంటే ఎక్కువ భాగం లైన్‌లోకి రావాలి. ఎల్బీడబ్ల్యూ పరిశీలించేటప్పుడు మూడు కీలక దశలు ఉంటాయి:
ఈ మూడింటిలో ఏ దశలోనైనా.. బంతి అంచు మాత్రమే (50% కంటే తక్కువ భాగం) స్టంప్స్‌కు లేదా నిర్దేశిత లైన్‌కు తగులుతున్నట్లు టెక్నాలజీ చూపిస్తే, సాఫ్ట్‌వేర్ ఖచ్చితంగా చెప్పలేనట్లు లెక్క. దాన్నే అంపైర్స్ కాల్ అంటారు.
క్రికెట్ చరిత్రలో మైదానంలో ఉండే అంపైర్ నిర్ణయానికి అత్యున్నత గౌరవం ఉంటుంది. టెక్నాలజీ అనేది అంపైర్ చేసిన స్పష్టమైన బ్లండర్స్ సరిదిద్దడానికే తప్ప, మైక్రోస్కోపిక్ లెవల్లో అంపైర్‌ను తప్పుబట్టడానికి కాదు. సాఫ్ట్‌వేర్ 100శాతం ఖచ్చితత్వంతో ఇది ఔట్ లేదా ఇది నాటౌట్ అని చెప్పలేనప్పుడు.. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద గ్రౌండ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాన్నే తుది నిర్ణయంగా ఉంచుతారు.
గతంలో అంపైర్స్ కాల్ వస్తే రివ్యూ నష్టపోయే పరిస్థితి ఉండేది. కానీ ఐసీసీ నిబంధనలను సవరించింది. రివ్యూ ఫలితం అంపైర్స్ కాల్‌గా వస్తే.. నిర్ణయం ఎలా ఉన్నా సరే, రివ్యూ కోరిన జట్టు తమ రివ్యూని కోల్పోదు. ఎందుకంటే బంతి స్టంప్స్‌ను తాకుతున్నట్లు టెక్నాలజీ చూపించింది కాబట్టి బౌలింగ్ టీమ్ అంచనా తప్పు కాదు.. అలాగని అది పూర్తి స్థాయిలో తాకలేదు కాబట్టి అంపైర్ అంచనా కూడా తప్పు కాదు.
మొత్తానికి అంపైర్స్ కాల్ అనేది సాంకేతిక పరిజ్ఞానానికి, మానవ నిర్ణయానికి మధ్య ఉన్న ఒక సన్నని గీత. టెక్నాలజీ ఎంత పెరిగినా మైదానంలో అంపైర్ ప్రాధాన్యతను తగ్గించకూడదనే ఉద్దేశంతోనే క్రికెట్ బోర్డులు ఈ నియమాన్ని కొనసాగిస్తున్నాయి. ఇది కొన్నిసార్లు ఒక జట్టుకు అదృష్టాన్ని, మరో జట్టుకు దురదృష్టాన్ని తెచ్చిపెడుతూ ఐపీఎల్ ఉత్కంఠను మరింత పెంచుతోంది.