Kolkata Knight Riders vs Gujarat Titans Match Preview: ఐపీఎల్ 2022లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న జట్టు ఏదైనా ఉందంటే అది గుజరాత్ టైటాన్సే (Gujarat Titans). హార్ధిక్ పాండ్యా (Hardik Pandya) సారథ్యంలోని ఆజట్టు 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈక్రమంలో మరో విజయాన్ని ఖాతాలో వేసుకునేందుకు శనివారం (ఏప్రిల్23) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs GT)తో తలపడనుంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్(KKR) మొదట్లో బాగానే ఆడినా ఆతర్వాత వరుస పరాజయాలు ఎదుర్కొంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలు సాధించిన జట్టు గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం గమనార్హం. ఈక్రమంలో గుజరాత్‌పై గెలుపొంది పరాజయాల బాటకు స్వస్తి పలకాలని శ్రేయస్ జట్టు భావిస్తోంది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో సాయంత్రం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
పాండ్యా ఎంట్రీ..
ఓపెనర్ గిల్, కెప్టెన్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా లతో గుజరాత్ బ్యాటింగ్ పటిష్ఠంగా ఉంది. ఓపెనింగ్‌లో మాథ్యూ వేడ్ ఇంకా గాడిన పడలేదు. అతని స్థానంలో చివరి మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహాకు అవకాశం ఇచ్చినా సాహా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే అతనికి మరో ఛాన్స్ దక్కొచ్చు. ఇక బ్యాటింగ్ ఆడడమే రాదన్నట్లు వరుసగా విఫలమవుతోన్న విజయ్‌శంకర్ ఈ మ్యాచ్‌లో పెవిలియన్‌కే పరిమితం కావొచ్చు. అతని స్థానంలో గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన హార్ధిక్ తిరిగి జట్టులోకి రావొచ్చు. అల్జారీ జోసెఫ్ మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకోవచ్చు. అయితే అఫ్గాన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ కు ఛాన్స్ ఇస్తే మాత్రం జోసెఫ్ డగౌట్‌లోనే కూర్చోవాల్సి ఉంటుంది. రషీద్‌ఖాన్, లాకీ ఫెర్గూసన్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించనున్నారు.
కమిన్స్ స్థానంలో సౌథీకి ఛాన్స్!
ఆరంభంలో అదరగొట్టిన కోల్‌కతా ఇప్పుడు మాత్రం ఆటగాళ్ల నిలకడలేమితో వరుస పరజయాలు ఎదుర్కొంటోంది. ఓపెనర్ ఫించ్ రాణిస్తోన్న వెంకటేశ్ అయ్యర్ పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. ఇక మిడిలార్డర్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు సహకారం అందించే వారే కరువయ్యారు. నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్ మరియు షెల్డన్ జాక్సన్ లు నిలకడగా పరుగులు సాధించాల్సి ఉంది. ఇక కేకేఆర్ బౌలింగ్ కూడా చాలా బలహీనంగా ఉంది. సునీల్ నరైన్ మాత్రమే కొంత ప్రభావం చూపుతున్నాడు. ఆరంభ మ్యాచ్‌ల్లో వికెట్లు తీసిన ఉమేష్ యాదవ్ తో పాటు పాట్ కమిన్స్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి, ఆండ్రీ రస్సెల్ కూడా బంతితో రాణించలేకపోతున్నారు. ఈక్రమంలో ప్యాట్ కమిన్స్ ప్లేస్ లో టిమ్ సౌథీని తుదిజట్టులోకి తీసుకోవచ్చు.
ఇరు జట్ల ప్లేయింగ్ – XI ఎలా ఉండొచ్చంటే..
కోల్‌కతా నైట్ రైడర్స్ :
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి.
గుజరాత్ టైటాన్స్:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, అల్జారీ జోసెఫ్/రహ్మానుల్లా గుర్బాజ్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, లాకీ ఫెర్గూసన్ మరియు యశ్ దయాల్.
టీవీ9లో నిరంతరం అప్‌డేట్స్..
Kolkata Knight Riders vs Gujarat Titans మధ్య మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషలలో చూడవచ్చు. అదేవిధంగా డిస్నీ+హాట్‌స్టార్‌లో సబ్‌స్ర్కిప్షన్‌తో వీక్షించొచ్చు. వీటితో పాటు https://tv9telugu.com/ ద్వారా ఎప్పటికప్పుడు మ్యాచ్ అప్‌డేట్స్‌ను తెలుసుకోవచ్చు.
Ukraine – Russia War: ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో కీలక పరిమాణం.. సంచలన ప్రకటన చేసిన పుతిన్..!
Andhra Pradesh Politics: 2024 ఎన్నికలే టార్గెట్‌గా రంగంలోకి చంద్రబాబు.. సీనియర్లకు వార్నింగ్స్..!