
Who is Manav Suthar: భారత క్రికెట్‌లో మరో కొత్త శకం ఆరంభమైంది. దేశవాళీ క్రికెట్‌లో ఏళ్ల తరబడి చెమటోడ్చిన ఒక యువకుడు, ఎట్టకేలకు టీమిండియా వైట్ జెర్సీని ధరించి తన కలని నిజం చేసుకున్నాడు. అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో రాజస్థాన్‌కు చెందిన ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ భారత 319వ టెస్ట్ ఆటగాడిగా అరంగేట్రం చేశాడు.
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో 2002, ఆగస్టు 3న జన్మించిన మానవ్ జగదీశ్‌కుమార్ సుతార్ బాల్యం అంతా కఠోర సాధన, క్రమశిక్షణతోనే గడిచింది. చిన్న వయసులోనే క్రికెట్ పట్ల అపారమైన మక్కువ పెంచుకున్న మానవ్, స్థానిక మైదానాల్లో గంటల తరబడి బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. అతని నాయకత్వ ప్రతిభకు గుర్తింపుగా శ్రీ గంగానగర్ జిల్లా అండర్-14, అండర్-16 జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్స్ అందించాడు. ఆ తర్వాత రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలోని అండర్-16, అండర్-19, అండర్-23 జట్లలో స్థానం సంపాదిస్తూ అంచలంచెలుగా ఎదిగాడు. ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోకుండా సాగిన అతని ప్రయాణం, చివరకు భారత జాతీయ జట్టు తలుపులు తట్టేలా చేసింది.
2022 ఫిబ్రవరి 17న ఆంధ్రప్రదేశ్‌పై రంజీ ట్రోఫీ మ్యాచ్ ద్వారా మానవ్ తన ఫస్ట్-క్లాస్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అయితే, 2022-23 రంజీ సీజన్ అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే 20.33 అద్భుతమైన సగటుతో 39 వికెట్లు పడగొట్టి, రాజస్థాన్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. తన మొదటి ఎనిమిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లోనే 44 వికెట్లు సాధించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
ఇప్పటివరకు ఆడిన 29 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 25.76 సగటుతో, కేవలం 2.94 ఎకానమీతో 129 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన, మూడుసార్లు మ్యాచ్‌లో పది వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. ఒక ఇన్నింగ్స్‌లో 33 పరుగులకే 8 వికెట్లు తీయడం అతని కెరీర్ బెస్ట్ స్పెక్టాకల్. కేవలం బౌలింగ్‌లోనే కాకుండా, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌తోనూ మానవ్ రాణించగలడు. హిమాచల్ ప్రదేశ్‌పై 120 పరుగుల సెంచరీతో పాటు ఆరు అర్ధసెంచరీలు సాధించి, జట్టుకు అవసరమైనప్పుడు అండగా నిలబడగల ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
The smile says it all ☺️🧢
Congratulations to debutant Manav Suthar as he receives his #TeamIndia Test cap from Kuldeep Yadav 🙌
Updates ▶️ https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/YRa3nUnYIY
— BCCI (@BCCI) June 6, 2026
భారత ప్రీమియర్ లీగ్ (IPL) మానవ్ సుతార్‌లోని ప్రతిభకు మరింత పదును పెట్టింది. 2023లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు నెట్ బౌలర్‌గా చేరిన మానవ్, అంతర్జాతీయ దిగ్గజాల ఆటను నిశితంగా గమనిస్తూ తన బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. అతని ప్రతిభను గుర్తించిన ఫ్రాంచైజీ, 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అతనికి ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత 2025, 2026 సీజన్లలోనూ గుజరాత్ జట్టు అతడిని తమతోనే ఉంచుకుంది. ఐపీఎల్ 2026లో మూడు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు తీసినప్పటికీ, ఆ వేదిక ఇచ్చిన ఒత్తిడిని తట్టుకునే అనుభవం అతనికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో ఉపయోగపడుతుందని జట్టు యాజమాన్యం నమ్మింది.
అఫ్గానిస్తాన్‌తో జరిగే టెస్టుకు మానవ్‌ను ఎంపిక చేయడం వెనుక భారత జట్టు మేనేజ్‌మెంట్ ఒక వ్యూహాత్మక ప్రణాళికను రచించింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటం, అలాగే సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడైన ఎడమచేతి వాటం స్పిన్నర్ అవ్వడం మానవ్‌కు కలిసివచ్చింది. సాంప్రదాయ పద్ధతిలో బంతిని గాల్లో లూప్ చేస్తూ, బ్యాటర్లను పరుగుల చేయకుండా అడ్డుకునే శైలి అతడి సొంతం.
దీనికి తోడు, ‘ఇండియా ఎ’ జట్టు తరపున మానవ్ అసాధారణ ప్రదర్శనలు చేశాడు. 2023 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో 10 వికెట్లతో జాయింట్ సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఆ తర్వాత దులీప్ ట్రోఫీలో 49 పరుగులకే 7 వికెట్లు, అలాగే 2025లో ఆస్ట్రేలియా ఎ జట్టుపై ఐదు వికెట్ల ప్రదర్శనతో తానేంటో నిరూపించుకున్నాడు. గత 12 ఏళ్లలో రాజస్థాన్ నుంచి భారత టెస్ట్ జట్టుకు ఎంపికైన మొదటి క్రికెటర్ మానవ్ సుతార్ కావడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..