బెంగుళూరు: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా – ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-బి 76 పరుగుల తేడాతో విజయం సాధించడం తెలిసిందే. 275 పరుగుల విజయ లక్ష్యంతో ఆదివారంనాడు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ జట్టు.. 198 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. కేఎల్ రాహుల్ (57), ఆకాశ్ దీప్ (47), రియాన్ పరాగ్ (31) మినహా మిగిలిన ఆగాళ్లు ఎవరూ గౌరవప్రదమైన స్కోరు సాధించలేదు. ఇండియా బి జట్టులో యశ్ దయాల్ 3 వికెట్లు పడగొట్టగా, ముకేశ్ కుమార్, నవదీప్ చెరో 2 వికెట్లు సాధించారు. 181 పరుగులతో అదరగొట్టిన ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
కాగా ఈ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర ఘటన క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇండియా బీ ఆటగాడు రిషభ్ పంత్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియా బీ బౌలర్ ముకేష్ కుమార్ వేసిన బంతి శివం ధూబే ప్యాడ్స్‌ను తగిలింది. బౌలర్ అప్పీల్ చేసినా అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో అంపైర్ నిర్ణయంపై రివ్యూకి వెళ్లే విషయంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్, ఇండియా బీ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ మధ్య షార్ట్ డిస్కషన్ జరిగింది. దీనిపై రివ్యూ అవసరం లేదని పంత్ కెప్టెన్‌కి సలహా ఇచ్చాడు.
అయినా పంత్ సలహాను లెక్క చేయకుండా అభిమన్యు ఈశ్వరన్ అంపైర్ నిర్ణయంపై రివ్యూ కోసం వెళ్లాడు. అయితే రిషభ్ పంత్ నిర్ణయమే సరైనదిగా రివ్యూలో తేలింది. రివ్యూను ఇండియా బీ టీమ్ లాస్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో చూడండి..
Rishabh Pant denied Eshwaran for the review but he still goes for it & Lost the review. pic.twitter.com/y10TBfKeI6
— PantMP4. (@indianspirit070) September 8, 2024
టెస్ట్‌లో పంత్ రీ ఎంట్రీ..
ఇదిలా ఉండగా భారత్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభంకానున్న మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం ఎంపికైన భారత జట్టులో రిషభ్ పంత్ చోటు దక్కించుకున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా 20 మాసాలు టెస్ట్‌లకు దూరమైన పంత్.. ఎట్టకేలకు ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం ఈ టెస్ట్ మ్యాచ్‌కు వేదికకానుంది.