
VVS Laxman BCCI Chief Selector: భారత క్రికెట్ జట్టు ఎంపికల విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలానికి త్వరలోనే మంగళం పాడేందుకు సిద్ధమవుతున్నట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆయన స్థానంలో హైదరాబాద్ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
2023 జూలై నెలలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అజిత్ అగార్కర్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనకు గతంలో పొడిగింపు లభించింది. 2026 జూన్ వరకు ఆయనకు గడువు ఇచ్చినా, రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ వరకు పదవిని పొడిగించేందుకు బోర్డు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు బీసీసీఐ ఉన్నతాధికారులతో అగార్కర్‌కు విభేదాలు వస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్‌ను తదుపరి చీఫ్ సెలెక్టర్‌గా నియమించాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు.
బీసీసీఐ అధికారుల్లో చాలామంది లక్ష్మణ్ వైపే మొగ్గు చూపుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లతో లక్ష్మణ్‌కు ఎంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. అగార్కర్ కంటే లక్ష్మణ్ సీనియర్ కావడం, భారత జట్టులో ఎన్నో ఏళ్లపాటు దిగ్గజ ఆటగాడిగా కొనసాగడం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.
సీనియర్ ఆటగాళ్లతో పాటు యంగ్ క్రికెటర్లను ఎలా హ్యాండిల్ చేయాలో లక్ష్మణ్‌కు బాగా తెలుసు. రోహిత్, విరాట్ సైతం లక్ష్మణ్ నిర్ణయాలకు గౌరవం ఇస్తారని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. ఈ కారణంతోనే సెలక్షన్ కమిటీ రథసారధిగా ఆయన పేరును దాదాపు ఖాయం చేసినట్లు తెలుస్తోంది.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కొందరు ఆటగాళ్లకు వరుస అవకాశాలు కల్పిస్తున్నారు. అందులో ప్రధానంగా తమిళనాడు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేరు కనిపిస్తుంది. టెస్టుల్లో మినహా టీ20, వన్డేల్లో సుందర్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉన్నా గంభీర్ అతనికి నిరంతరం మద్దతుగా నిలుస్తున్నారు.
లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరిస్తే గంభీర్ ప్లాన్లకు పెద్ద గండి పడే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సుందర్ బౌలింగ్, బ్యాటింగ్ రెండూ నిరాశపరుస్తుండటంతో.. లక్ష్మణ్ రాకతో అతనికి జట్టులో చోటు దక్కడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..