
VVS Laxman 281 Innings: భారత క్రికెట్‌ను 1983 వరల్డ్ కప్ విజయం ఒక మలుపు తిప్పితే, 2001 కోల్‌కతా టెస్ట్ మ్యాచ్ టెస్ట్ క్రికెట్ పట్ల భారతీయుల దృక్పథాన్ని మార్చేసింది. అప్పటివరకు వరుసగా 16 టెస్ట్ విజయాలతో అప్రతిహతంగా సాగుతున్న స్టీవ్ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టును, ఈ మ్యాచ్‌లో భారత్ మట్టికరిపించింది. ఈ విజయం భారత ఆటగాళ్లలో ‘మనం ఎవరినైనా ఓడించగలము’ అనే అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు, నేటి భారత క్రికెట్ సూపర్ పవర్ స్థాయికి చేరడానికి పడిన బలమైన పునాదిగా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో హైలైట్ అంటే వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన 281 పరుగుల ఇన్నింగ్స్. అప్పటివరకు భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సునీల్ గవాస్కర్ (236) పేరిట ఉండేది. దానిని చెరిపివేస్తూ లక్ష్మణ్ సృష్టించిన రికార్డు అద్భుతం. ముఖ్యంగా నాలుగో రోజు ఆట మొత్తం ఒక్క వికెట్ కూడా పడకుండా లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ (180) కలిసి రోజంతా బ్యాటింగ్ చేయడం క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా నిలిచింది. షేన్ వార్న్ వంటి మేటి స్పిన్నర్లను లక్ష్మణ్ ఎదుర్కొన్న తీరు, గ్లెన్ మెక్‌గ్రా బౌలింగ్‌లో కొట్టిన స్ట్రోక్స్ ఇప్పటికీ అభిమానుల కళ్లముందే కదలాడుతుంటాయి.
లక్ష్మణ్ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా, ఇతర ఆటగాళ్ల కృషిని మరువలేం. హర్భజన్ సింగ్ సాధించిన టెస్ట్ హ్యాట్రిక్ భారత్ తరపున మొదటిది. అలాగే చివరి రోజు కీలక సమయంలో సచిన్ టెండూల్కర్ తీసిన మూడు వికెట్లు మ్యాచ్ ఫలితాన్ని భారత్ వైపు తిప్పాయి. సౌరవ్ గంగూలీ నాయకత్వంలో యువ రక్తం ఉరకలేసి, ఆస్ట్రేలియా ‘ఫైనల్ ఫ్రాంటియర్’ ఆశలను ఆవిరి చేసింది.
పాతికేళ్లు గడిచినా, కోల్‌కతా టెస్ట్ జ్ఞాపకాలు గూస్‌బంప్స్ కలిగిస్తాయి. నేడు టెస్ట్ క్రికెట్‌లో సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసే ఓపిక తగ్గిపోతున్న తరుణంలో, లక్ష్మణ్, ద్రవిడ్ ప్రదర్శించిన ఏకాగ్రత, పట్టుదల నేటి తరం క్రికెటర్లకు పాఠం లాంటిది. ఈ విజయం ఇచ్చిన టానిక్‌తోనే భారత్ తర్వాతి కాలంలో ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయికి చేరుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..