
Virat Kohli : విజయ్ హజారే ట్రోఫీ కోసం సిద్ధమవుతున్న విరాట్ కోహ్లీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సరికొత్త హెయిర్‌స్టైల్, గడ్డంతో దర్శనమిచ్చారు. ఎప్పటికప్పుడు తన స్టైల్‌ను మార్చుకునే కోహ్లీ, ఈసారి మరింత ఫిట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కేవలం లుక్ పరంగానే కాకుండా, మైదానంలో కూడా అదే జోష్‌తో పరుగుల వరద పారించేందుకు కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
భారత దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఆడటం దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా ఆయన 2010లో ఢిల్లీ తరపున ఈ టోర్నీలో ఆడారు. డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో ఢిల్లీ జట్టుకు స్టార్ ప్లేయర్‌గా కోహ్లీ అందుబాటులోకి రావడం దేశవాళీ క్రికెట్‌కు పెద్ద బూస్ట్ అని చెప్పాలి. బీసీసీఐ ఆదేశాల మేరకు అంతర్జాతీయ ఆటగాళ్లు దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలనే నిబంధనతో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ టోర్నీలో ఢిల్లీ జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాడు తన కెప్టెన్సీలో ఆడటం పంత్‌కు కూడా ఒక మంచి అనుభవం. ఢిల్లీ తన గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ బెంగళూరు వేదికగా ఆడనుంది. డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగనున్నారు. ఆ తర్వాత గుజరాత్, సౌరాష్ట్ర వంటి పటిష్టమైన జట్లతో ఢిల్లీ తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ కోహ్లీకి తన పాత హోమ్ గ్రౌండ్ (RCB హోమ్ గ్రౌండ్) బెంగళూరులో జరగడం విశేషం.
టెస్టులు, టీ20ల నుంచి విరామం తీసుకున్న కోహ్లీ, ఇప్పుడు తన పూర్తి దృష్టిని వన్డే ఫార్మాట్‌పై పెట్టారు. జనవరిలో న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు ఈ విజయ్ హజారే ట్రోఫీ కోహ్లీకి మంచి ప్రాక్టీస్‌గా మారనుంది. 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా కోహ్లీ తన ఫామ్‌ను కాపాడుకోవాలని చూస్తున్నారు. తన అనుభవంతో ఢిల్లీ యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తూనే, తన బ్యాట్‌తో మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..