Virat Kohli: దేశం కోసం ఆడుతున్నారని గుర్తుంచుకోండి.. కోహ్లీ వ్యాఖ్యలపై కపిల్ దేవ్ స్పందన..
భారత క్రికెట్‌లో కోహ్లీ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించిన తీరుతో మొదలైన వివాదం కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత తీవ్రస్థాయికి చేరుకుంది...
భారత క్రికెట్‌లో కోహ్లీ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించిన తీరుతో మొదలైన వివాదం కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత తీవ్రస్థాయికి చేరుకుంది. డిసెంబరు 15 బుధవారం విలేకరుల సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ, కెప్టెన్సీ నుండి తనను తొలగించడం గురించి తనకు ముందుగా తెలియజేయలేదని చెప్పాడు. దీనితో పాటు, బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నట్లుగా, టీ20 కెప్టెన్సీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నప్పుడు తనను ఎవరూ ఆపలేదని కోహ్లీ చెప్పాడు. ఇప్పుడు ఈ విషయంపై భారత మాజీ కెప్టెన్, గ్రేట్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
తన నిర్ణయం గురించి ఎవరికైనా చెప్పాలా వద్దా..? నిర్ణయాధికారం సెలెక్టర్లదే అని కపిల్ దేవ్ ఓ ఇంటర్య్వూలో అన్నారు. “సెలెక్టర్లు విరాట్ కోహ్లీ అంత క్రికెట్ ఆడకపోవచ్చు, కానీ కెప్టెన్సీని నిర్ణయించే హక్కు వారికి ఉంది. వారు విరాట్‌తో పాటు ఎవరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు.” అని కపిల్ చెప్పాడు.
టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగే సమయంలో కోహ్లీకి రాజీనామా చేయవద్దని తానే స్వయంగా చెప్పానని గంగూలీ ఇటీవల తెలిపాడు. అయితే తనను ఎవరూ అడ్డుకోలేదని విలేకరుల సమావేశంలో కోహ్లీ చెప్పాడు. కెప్టెన్ బీసీసీఐ అధ్యక్షుడి మధ్య బహిరంగ వ్యాఖ్యలు భారత క్రికెట్ ప్రతిష్టను ప్రభావితం చేసింది. బోర్డు అధ్యక్షుడికి వ్యతిరేకంగా కోహ్లీ మాట్లాడకూడదని కపిల్ అన్నాడు. “నేను కోహ్లీకి పెద్ద అభిమానిని, కానీ ఏ ఆటగాడు బీసీసీఐ అధ్యక్షుడికి లేదా బోర్డుకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నన్ను కెప్టెన్సీ నుండి తప్పించినప్పుడు, నేను కూడా చాలా బాధపడ్డాను, కానీ మీరు దేశం కోసం ఆడుతున్నారని గుర్తుంచుకోండి. అంతకు మించి ఇంకేమీ ముఖ్యం కాదు.” అంటూ కపిల్ స్పష్టం చేశాడు.
ఈ మొత్తం రచ్చ తర్వాత బీసీసీఐ ఎలాంటి వివరణ ఇవ్వనప్పటికీ, ప్రస్తుత వివాదం టెస్టుల్లో కోహ్లీ కెప్టెన్సీని ప్రభావితం చేయకూడదని కపిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ వివాదం విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీపై ప్రభావం చూపకూడదని ఆశిస్తున్నా’ అని కపిల్ అన్నాడు. అతను గొప్ప ఆటగాడు. సెలక్టర్లు కూడా అలాగే ఆలోచిస్తారని ఆశిస్తున్నాం. విరాట్ దక్షిణాఫ్రికా పర్యటనపై దృష్టి పెట్టాలి.