
Virat Kohli : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, సినీ నటి అనుష్క శర్మ ఇటీవల లండన్ పర్యటన ముగించుకొని ముంబై ఎయిర్‌పోర్టుకు తిరిగి వచ్చారు. ఆ సమయంలో తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ జంట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. వైరల్ అవుతున్న ఆ క్లిప్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఎయిర్‌పోర్టు టెర్మినల్ నుంచి బయటకు వస్తుండగా ఒక దివ్యాంగుడు ఫోటో కోసం విరాట్ దగ్గరకు రావడానికి ప్రయత్నించాడు.
ఆ వ్యక్తి ఫోటో కోసం దగ్గరికి రాగానే భద్రతా సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని అతన్ని పక్కకు తోసేశారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కారు ఎక్కాడు. అతని వెంటే అనుష్క శర్మ కూడా కారులో వెళ్లిపోయింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఆ వ్యక్తిని పట్టించుకోకుండా అతని వైపు కనీసం చూడకుండా వెళ్లిపోవడం ఈ విమర్శలకు ప్రధాన కారణమైంది. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ వ్యక్తిని భద్రతా సిబ్బంది పక్కకు తోసేసినా కూడా విరాట్ కోహ్లీ కనీసం ఆగి మాట్లాడకపోవడం లేదా జోక్యం చేసుకోకపోవడాన్ని చాలా మంది ప్రశ్నించారు.
Virat Kohli and Anushka Sharma were spotted at Mumbai Airport after taking blessings from Premanand Ji Maharaj. pic.twitter.com/3L9FOUBJmw
— Virat Kohli Fan Club (@Trend_VKohli) December 16, 2025
ఈ వీడియోపై ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చ జరిగింది. “సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు అడిగితే విసుగు రావడం సహజమే. కానీ ఒక దివ్యాంగుడిని ఇంత నిర్లక్ష్యంగా చూడటం చాలా తప్పు. అతను కనీసం వినయంగా నిరాకరించినా సరిపోయేది. గార్డులు ఆ పిల్లాడిని తోసేస్తుంటే ఆపడానికి కూడా ప్రయత్నించకపోవడం దారుణం” అని ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరొకరు “ప్రేమానంద్ జీ మహారాజ్‌ను కలిసి వచ్చారు. కానీ వీరికి నేర్పింది ఇదేనా? ఇతరుల పట్ల ఇలాంటి అహంకారం చూపడం సిగ్గుచేటు” అని మండిపడ్డారు. ప్రైవసీ కావాలనుకుంటే ముందుగా ఫోటోగ్రాఫర్లను ఎందుకు పిలుస్తారని మరికొందరు ప్రశ్నించారు.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో ఉన్న శ్రీ హిత్ రాధా కేలి కుంజ్ (వరహ్ ఘాట్) ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ వారు ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్‌ను కలిశారు. తమ వృత్తి జీవితాన్ని ఆధ్యాత్మిక కోణం నుంచి చూడాలని ఆ స్వామి వారికి సలహా ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక పర్యటన ముగిసిన కొద్ది రోజులకే ఈ ఎయిర్‌పోర్ట్ వివాదం తలెత్తడం విమర్శలకు మరింత ఆజ్యం పోసింది. ఈ జంట ఈ సంవత్సరంలో బృందావన్‌ను సందర్శించడం ఇది మూడవసారి.