Virat Kohli: అందుకే కోహ్లీకి ఇండియాలో ఉండటం ఇష్టంలేదు! షాకింగ్ విషయాలు వెల్లడించిన లివింగ్‌స్టోన్

విరాట్ కోహ్లీ మైదానంలో అత్యంత పోటీతత్వం గల ఆటగాడైనా, వ్యక్తిగత జీవితంలో ప్రశాంతంగా కుటుంబంతో గడపాలనుకునే వ్యక్తి అని లియామ్ లివింగ్‌స్టోన్ వెల్లడించాడు. నిరంతరం తనపై ఉండే మీడియా, అభిమానుల దృష్టిని కోహ్లీ పెద్దగా ఇష్టపడడని చెప్పాడు. ఆర్‌సీబీలో కోహ్లీ ఆటతీరులో వచ్చిన మార్పులకు కోచ్‌లు కీలక కారణమని ప్రశంసించాడు.

Virat Kohli: అందుకే కోహ్లీకి ఇండియాలో ఉండటం ఇష్టంలేదు! షాకింగ్ విషయాలు వెల్లడించిన  లివింగ్‌స్టోన్
Virat Kohli

Updated on: Jun 05, 2026 | 9:02 AM

భారత క్రికెట్ దిగ్గజం, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో గ్రౌండ్ బయట కోహ్లీ పూర్తిగా భిన్నంగా ఉంటాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ వెల్లడించాడు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన లివింగ్‌స్టోన్.. కోహ్లీ వ్యక్తిత్వం, అతని జీవనశైలి, అలాగే ఆటలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కోహ్లీతో కలిసి ఆడిన లివింగ్‌స్టోన్, డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ చాలా సరదాగా, స్నేహపూర్వకంగా ఉంటాడని చెప్పాడు. మైదానంలో మాత్రం అతను పూర్తిగా భిన్నంగా మారిపోతాడని, తాను చూసిన ఆటగాళ్లలో అత్యంత పోటీతత్వం కలిగిన క్రికెటర్ కోహ్లీనేనని పేర్కొన్నాడు. ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చే విషయంలోనూ, జట్టును ముందుండి నడిపించే విషయంలోనూ కోహ్లీ ప్రత్యేకమైన వ్యక్తి అని ప్రశంసించాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్, అభిమానుల ఆదరణతో వచ్చే ఒత్తిడిని కోహ్లీ పెద్దగా ఇష్టపడడని లివింగ్‌స్టోన్ వెల్లడించాడు. విమానాశ్రయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాలు ఎక్కడికెళ్లినా తనపై అందరి దృష్టి ఉండటం కోహ్లీకి అసౌకర్యంగా అనిపిస్తుందని తెలిపాడు. క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపడం కోహ్లీకి ఎంతో ఇష్టమని చెప్పాడు.

ఇటీవలి సంవత్సరాల్లో కోహ్లీ తన సమయాన్ని భారత్‌, ఇంగ్లాండ్ మధ్య పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌కు ముందు ఇంగ్లండ్‌లో ఎక్కువ కాలం గడపడానికి ప్రధాన కారణం నిరంతర మీడియా దృష్టి నుంచి కొంత విరామం పొందడమేనని పలు కథనాలు పేర్కొన్నాయి. అదే సమయంలో కోహ్లీ బ్యాటింగ్‌లో వచ్చిన మార్పులపై కూడా లివింగ్‌స్టోన్ స్పందించాడు. ఆర్‌సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్లు కోహ్లీ ఆటతీరును మరింత దూకుడుగా మార్చడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నాడు. పవర్‌ప్లేలో ఎక్కువగా ఎటాక్ చేయడం, స్పిన్ బౌలింగ్‌పై మరిన్ని షాట్లు ఆడడం వంటి అంశాల్లో కోహ్లీ తన ఆటను కొత్త స్థాయికి తీసుకెళ్లాడని లివింగ్‌స్టోన్ అభిప్రాయపడ్డాడు. మైదానంలో అగ్నిపర్వతంలా కనిపించే కోహ్లీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో ప్రశాంతమైన, కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తి అని లివింగ్‌స్టోన్ వ్యాఖ్యలు మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us