
Vaibhav Suryavanshi: భారత క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఒక పేరు మార్మోగిపోతోంది. ఆ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. మొదట ఐపీఎల్‌లో ఆపై ఇంగ్లండ్‌పై, తాజాగా ఆస్ట్రేలియాపై అతని ఆటతీరు అద్భుతం. ఈ 14 ఏళ్ల కుర్రాడి గురించి క్రికెట్ వర్గాల్లో చర్చలు తారాస్థాయికి చేరుకున్నాయి. 13 ఏళ్ల వయసులో వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు, అందరి దృష్టి అతనిపై పడింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడిగా సెంచరీ సాధించి, నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనలలోకెల్లా, జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఏప్రిల్ 28న అతను ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి మైదానంలో నిప్పులు రాజేశాడు. వైభవ్ భారత తరఫున ఆడిన సీనియర్ బౌలర్లను కూడా ఏమాత్రం కనికరించలేదు. ఈ కుర్రాడు ఏకంగా 11 సిక్సర్లు, 7 ఫోర్లతో 101 పరుగులు సాధించాడు. అతని ఈ ధాటికి రాయల్స్ జట్టు 210 పరుగుల భారీ లక్ష్యాన్ని 16 ఓవర్లలోపే ఛేదించింది. 14 ఏళ్ల కుర్రాడి నుంచి అలాంటి విధ్వంసం చూడటం అప్పటి వరకు అద్భుతమే.
వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ గురించి తాజాగా రవిశాస్త్రి గుర్తు చేసుకున్నారు. ఆ మ్యాచ్ సందర్భంగా తాను కామెంటరీ ఇస్తున్నానని, మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి సీనియర్ బౌలర్లను కూడా ఎక్స్‌ట్రా కవర్, మిడ్‌వికెట్ మీదుగా స్మాష్ చేశాడని చెప్పారు. ఈ దృశ్యాన్ని చూసిన ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్.. అతనికి 14 ఏళ్లు అంటే నేను నమ్మలేను అని గట్టిగా చెప్పినట్లు శాస్త్రి గుర్తు చేసుకున్నారు. దానికి తాను కూల్ కూల్ అని సమాధానం ఇచ్చినట్లు విల్లో టాక్ షోలో తెలిపారు. ఐపీఎల్ సెంచరీతో పాటు, వైభవ్ ఇంగ్లండ్ అండర్-19 జట్టుపై 143 పరుగులు (78 బంతుల్లో), ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై 104 పరుగులు (62 బంతుల్లో) చేసి తన ఫామ్‌ను కొనసాగించాడు.
వైభవ్ సూర్యవంశీ టాలెంటుపై సందేహం లేనప్పటికీ, భారత క్రికెట్‌లో చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్లు కూడా మధ్యలోనే వెనుకబడిపోయిన చేదు నిజాన్ని రవిశాస్త్రి గుర్తు చేశారు. “ఇప్పుడు అతనికి అత్యంత కష్టమైన సమయం. సచిన్ మాదిరిగా, ఇంత చిన్న వయసులో గొప్ప ముద్ర వేయడం వల్ల, రాబోయే 2-3 సంవత్సరాలు అతనికి ఎవరినో ఒకరి గైడెన్స్ చాలా అవసరం. ఎందుకంటే ఈ సమయంలో యువకులు చాలా త్వరగా దారి తప్పవచ్చు. అంచనాలు పెరగడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని హ్యాండిల్ చేయలేకపోవచ్చు” అని శాస్త్రి హెచ్చరించారు.
రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఎవరైనా అతనికి నువ్వు ఏదో ఒక దశలో ఫెయిల్ అవ్వడం ఖాయమని చెప్పాలి. ఈ గేమ్ అలాంటిది. కాబట్టి బాధపడకు. ఫెయిల్యూర్ స్వీకరించడం అలవాటు చేసుకుంటేనే నువ్వు బాగా ఆడతావు. ఈ సమయం అతనికి చాలా ముఖ్యం” అని అన్నారు. సూర్యవంశీని సచిన్ టెండూల్కర్ లేదా విరాట్ కోహ్లీతో పోల్చడంపై శాస్త్రి స్పందిస్తూ.. ఆ ప్రశ్నకు చరిత్ర మాత్రమే సమాధానం చెప్పగలదని అన్నారు. అయితే వైభవ్ సూర్యవంశీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని తేల్చి చెప్పారు. తన టెక్నిక్‌ను మెరుగుపరుచుకోవడానికి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలని సూచించారు. అలా చేయడం వల్ల మంచి బంతిని ఎలా ఎదుర్కోవాలో ఏ బౌలర్‌ను గౌరవించాలో తెలుసుకుని మరింత పరిణతి సాధిస్తాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..