
Vaibhav Suryavanshi vs Jasprit Bumrah: భారత క్రికెట్ రంగంలో సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతి చిన్న వయసులోనే ఐపీఎల్ వేదికగా దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న ఈ యువ కిరణాన్ని వెంటనే జాతీయ జట్టులోకి తీసుకోవాలని మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐని కోరాడు. తన తుఫాన్ బ్యాటింగ్‌తో వైభవ్ సృష్టించిన ప్రకంపనలు ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో తన అద్వితీయమైన బ్యాటింగ్ నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఈ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. మైదానంలో దిగితే చాలు పరుగుల వర్షం కురిపిస్తున్న ఈ యువ ఆటగాడిని చూసి క్రీడా పండితులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు సాధించి తన సత్తా చాటాడు. తక్కువ బంతుల్లో ఇంతటి భారీ స్కోరు సాధించడం వైభవ్ దూకుడుకు నిదర్శనం.
గతంలో ఒకానొక సందర్భంలో వైభవ్ మాట్లాడుతూ.. “నేను గత ఏడాది జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాను, కానీ ఈసారి ఆయన బౌలింగ్‌లో భారీ పరుగులు సాధించడమే నా లక్ష్యం” అని ధీమా వ్యక్తం చేశాడు. అన్న మాట ప్రకారం, ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా పేరుగాంచిన బుమ్రాని ధైర్యంగా ఎదుర్కొని తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో బుమ్రా లాంటి దిగ్గజాన్ని ఎదుర్కోవడం అనుభవజ్ఞులైన ఆటగాళ్లకే సాధ్యపడని పని. అలాంటిది ఈ చిచ్చరపిడుగు తన మాటను నిలబెట్టుకోవడం విశేషం.
వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించారు. 15 ఏళ్ల వయసులోనే ఇంతటి పరిణతితో కూడిన ఆటను తాను ఎక్కడా చూడలేదని ఆయన పేర్కొన్నారు. బీసీసీఐకి సూచనలు చేస్తూ, “ఇలాంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని ఇంకా వేచి ఉంచడంలో అర్థం లేదు. ఇప్పుడే జాతీయ జట్టులోకి తీసుకుంటే అతను మరో ఇరవై ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించగలడు” అని అభిప్రాయపడ్డారు.
వైభవ్ కేవలం ముంబైపైనే కాకుండా అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఊచకోత కోశాడు. కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు బాది అందరినీ విస్మయానికి గురిచేశాడు. అత్యంత వేగంగా హాఫ్ సెంచరీలు సాధిస్తూ టీమిండియా భవిష్యత్ ఆశాకిరణంగా మారుతున్నాడు. ఈ క్రమంలో సెలక్టర్లు ఇర్ఫాన్ పఠాన్ సూచనలను పరిగణనలోకి తీసుకుని వైభవ్‌కు జాతీయ జట్టులో అవకాశం కల్పిస్తారేమో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..