
Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ, బలమైన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. కేవలం 17 బంతుల్లో 52 పరుగులు చేసిన ఈ యువ కెరటం, అందులో కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసి ఐపీఎల్ రికార్డులను సమం చేశాడు. మైదానం నలుమూలలా అతను బాదిన షాట్లు చూస్తుంటే, ఒక అనుభవజ్ఞుడైన అంతర్జాతీయ ఆటగాడు ఆడుతున్నట్లు అనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వైభవ్ అద్భుత ప్రదర్శన చూసిన పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్, అతడిని వెంటనే భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఇంత చిన్న వయస్సులో ఇంతటి పరిణతితో ఆడటం అసాధారణమని, ఐపీఎల్ ముగియగానే అతను టీమ్ ఇండియా నీలి రంగు జెర్సీలో కనిపిస్తాడని అక్మల్ జోస్యం చెప్పారు. సరిహద్దుల అవతల నుంచి కూడా వైభవ్ ప్రతిభకు ప్రశంసలు దక్కడం అతని సత్తాకు నిదర్శనం.
వైభవ్ సూర్యవంశీలో ఉన్న అతిపెద్ద బలం అతని భయం లేని బ్యాటింగ్ శైలి. లక్ష్యం చిన్నదైనా, పెద్దదైనా ఏమాత్రం తడబడకుండా బౌలర్లపై విరుచుకుపడటమే ఇతని శైలి. యశస్వి జైస్వాల్‌తో కలిసి అతను అందించిన ఓపెనింగ్ భాగస్వామ్యం రాజస్థాన్ జట్టుకు సునాయాస విజయాన్ని అందించింది. కేవలం పరుగులు చేయడమే కాకుండా, మ్యాచ్ పరిస్థితులను బట్టి తన ఆటను మార్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ వైభవ్ ఆటతీరును సరదాగా ప్రశంసించారు. “ఈ ఒక్క బబ్లూ అందరికంటే భారంగా మారాడు” అంటూ వైభవ్ దూకుడును కొనియాడాడు. అనుభవజ్ఞులైన బౌలర్ల బంతులకు కూడా తన దగ్గర సమాధానం ఉందని వైభవ్ నిరూపించాడు. అతని షాట్ ఎంపిక, మైదానంలో చూపే తెగువ భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకమని నిపుణులు అంటున్నారు. ఏదేమైనా, 15 ఏళ్లకే భారత జట్టులో చోటు సంపాదిస్తే, అది క్రికెట్ చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టంగా నిలిచిపోతుంది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..