Vaibhav Suryavanshi : 511 బంతుల్లో 99 సిక్సర్లు.. వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ టి 20ల్లో 511 బంతుల్లో 99 సిక్సర్లతో సంచలనం. కీరన్ పొలార్డ్ రికార్డుకు ఒక్క సిక్సర్ దూరంలో నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ స్టార్‌గా వెలుగుతున్న అతని ప్రదర్శన ఐపీఎల్ 2026లో హాట్ టాపిక్‌గా మారింది.

Vaibhav Suryavanshi :  511 బంతుల్లో 99 సిక్సర్లు.. వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
Vaibhav Suryavanshi

Updated on: Apr 29, 2026 | 1:26 PM

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. ఈ 15 ఏళ్ల కుర్రాడు కేవలం పరుగులు చేయడమే కాదు, ప్రపంచ దిగ్గజాల రికార్డులను కూడా గజగజ వణికేలా చేస్తున్నాడు. తాజాగా పంజాబ్ కింగ్స్‌పై 16 బంతుల్లోనే 43 పరుగులు బాదిన వైభవ్, ఇప్పుడు విండీస్ పవర్ హిట్టర్ కీరన్ పొలార్డ్ పేరిట ఉన్న ఒక అరుదైన ప్రపంచ రికార్డును బ్రేక్ చేసేందుకు రెడీ అయ్యాడు. కేవలం ఒక్కటంటే ఒక్క సిక్సర్‌తో క్రికెట్ చరిత్రలో వైభవ్ ఒక కొత్త చరిత్రను రాయబోతున్నాడు.

టి20 క్రికెట్‌లో అత్యంత తక్కువ బంతుల్లో 100 సిక్సర్లు బాదిన రికార్డు ప్రస్తుతం వెస్టిండీస్ లెజెండ్ కీరన్ పొలార్డ్ పేరిట ఉంది. పొలార్డ్ 843 బంతుల్లో ఈ ఘనత సాధించగా, వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు కేవలం 511 బంతుల్లోనే 99 సిక్సర్లు పూర్తి చేశాడు. అంటే పొలార్డ్ కంటే దాదాపు 300 బంతులు తక్కువ ఆడినా, ఒక్క సిక్సర్ కొడితే వైభవ్ సరికొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. మే 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

వైభవ్ ఆడే స్టైల్ చూస్తుంటే అతను మైదానంలో సెట్ అవ్వడానికి అస్సలు సమయం తీసుకోడని అర్థమవుతోంది. ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో అతను ఇప్పటివరకు 400 పరుగులు సాధించాడు. విశేషం ఏంటంటే ఇందులో 358 పరుగులు కేవలం ఫోర్లు, సిక్సర్ల (34 ఫోర్లు, 37 సిక్సర్లు) ద్వారానే వచ్చాయి. సింగిల్స్, డబుల్స్ ద్వారా కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడంటే అతని బ్యాటింగ్ ఎంత విధ్వంసకరంగా ఉందో ఊహించవచ్చు. మొదట్లో ఇతను ప్రతి బాల్ షాట్లు ఆడుతున్నాడని విమర్శలు వచ్చినా, ఇప్పుడు సెంచరీలతో అందరి నోళ్లు మూయించాడు.

వైభవ్ ఇప్పటివరకు 27 టి20 ఇన్నింగ్స్‌ల్లో 1101 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. అతని మొత్తం టి20 కెరీర్‌లో 99 సిక్సర్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ యువ ఆటగాడు, కేవలం రెండో ఐపీఎల్ సీజన్ లోనే తన ఆధిపత్యాన్ని చాటుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో (35 బంతులు) సెంచరీ చేసిన భారతీయ బ్యాటర్‌గా గత ఏడాదే రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది కూడా 36 బంతుల్లోనే సెంచరీ బాది తన సత్తా చాటాడు.

రాజస్థాన్ రాయల్స్ తమ తదుపరి మ్యాచ్‌ను మే 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ ఒక్క సిక్సర్ కొడితే, క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా (బంతుల పరంగా) 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. 15 ఏళ్ల వయస్సులో ప్రపంచ రికార్డులను తిరగరాయడం అంటే సామాన్యమైన విషయం కాదు. కేవలం 16 ఐపీఎల్ మ్యాచుల్లోనే 652 పరుగులు చేయడం అతని టాలెంట్‌కు నిదర్శనం. రాజస్థాన్ అభిమానులు ఇప్పుడు వైభవ్ ఆ ఒక్క సిక్సర్ ఎప్పుడు కొడతాడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us