World Record: మరో 299 పరుగులు..టీ20ల్లో కొత్త చరిత్ర సృష్టించనున్న బీహార్ సంచలనం

World Record: బీహార్ యువ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ ప్రపంచ క్రికెట్‌లో చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటికే తన మెరుపు బ్యాటింగ్‌తో దిగ్గజాల రికార్డులను తుడిచిపెట్టేస్తున్న ఈ 14 ఏళ్ల కుర్రాడు.. ఇప్పుడు టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచేందుకు సిద్ధమయ్యాడు.

World Record: మరో 299 పరుగులు..టీ20ల్లో కొత్త చరిత్ర సృష్టించనున్న బీహార్ సంచలనం
Vaibhav Suryavanshi (10)

Updated on: Jan 13, 2026 | 10:28 AM

World Record: భారత క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క పేరు మార్మోగిపోతుంది… అదే వైభవ్ సూర్యవంశీ. బీహార్‌కు చెందిన ఈ 14 ఏళ్ల కుర్రాడు తన బ్యాటింగ్ విధ్వంసంతో ప్రపంచ క్రికెట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి, అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా ఇప్పటికే చరిత్ర సృష్టించిన వైభవ్, ఇప్పుడు మరో భారీ ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి అతను కేవలం 299 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ తన టీ20 కెరీర్‌లో 18 ఇన్నింగ్స్‌లలో 701 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.. ఏకంగా 204.37 స్ట్రైక్ రేట్‌తో అతను బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో 62 సిక్సర్లు, 53 ఫోర్లు బాదాడు. ఇప్పుడు అతను తన తదుపరి 5 ఇన్నింగ్స్‌లలో 299 పరుగులు సాధిస్తే, ప్రపంచంలోనే అత్యంత వేగంగా 1000 టీ20 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా షాన్ మార్ష్, బ్రాడ్ హాడ్జ్ లతో కలిసి అగ్రస్థానంలో నిలుస్తాడు. ఒకవేళ కేవలం 4 ఇన్నింగ్స్‌లలోనే ఈ పరుగులు చేస్తే, అతను ఈ రికార్డుకు ఏకైక యజమాని అవుతాడు.

ప్రస్తుతం టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన రికార్డు ఆస్ట్రేలియా ఆటగాళ్లు షాన్ మార్ష్, బ్రాడ్ హాడ్జ్ (చెరో 23 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉంది. వారి తర్వాత మాథ్యూ హేడెన్ (24 ఇన్నింగ్స్‌లు) ఉన్నాడు. భారతీయుల విషయానికి వస్తే, దేవదత్ పడిక్కల్ 25 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించి టాప్‌లో ఉన్నాడు. ఇప్పుడు వైభవ్ గనుక తన ఫామ్‌ను కొనసాగిస్తే వీరందరి రికార్డులు కనుమరుగవ్వడం ఖాయం. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్ వైభవ్ కెరీర్‌కు అత్యంత కీలకం కానుంది.

కేవలం ఐపీఎల్ లేదా దేశీయ క్రికెట్ మాత్రమే కాదు, త్వరలో జరగనున్న ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో కూడా వైభవ్ సూర్యవంశీ భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఆయుష్ మాత్రే సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగుతుండగా, వైభవ్ తన మెరుపు ఇన్నింగ్స్‌లతో భారత్‌కు ఆరోసారి ప్రపంచకప్ అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల ఆసియా కప్‌లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్, అదే ఊపును కొనసాగిస్తే 1000 పరుగుల ప్రపంచ రికార్డు సాధించడం అతనికి పెద్ద కష్టమేమీ కాదు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..