వైభవ్ జెర్సీ నంబర్ వెనుక ఇంత కథ ఉందా? చాలా పవర్‌ఫుల్‌‌ నంబరే ఎంచుకున్నాడుగా..

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి అడుగుపెట్టాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆడనుండటంతో భారత క్రికెట్‌లో అత్యంత పిన్న వయస్కుడిగా నిలవనున్నాడు. హర్భజన్ సింగ్ '03' జెర్సీని ఎంచుకుని వైభవ్ చర్చనీయాంశమయ్యాడు. అండర్-19 ప్రపంచకప్, ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచిన ఈ యువ సంచలనం, భారత క్రికెట్‌కు భవిష్యత్ ఆశగా మారాడు.

వైభవ్ జెర్సీ నంబర్ వెనుక ఇంత కథ ఉందా? చాలా పవర్‌ఫుల్‌‌ నంబరే ఎంచుకున్నాడుగా..
Vaibhav Suryavanshi About 0

Updated on: Jun 24, 2026 | 9:47 AM

క్రికెట్ లోకాన్ని షాక్‌కి గురి చేస్తూ.. వైభవ్ సూర్యవంశీ ఒక చిచ్చరపిడుగులా దూసుకొచ్చాడు. అతని రాకతో భారత క్రికెట్‌లో మరో సంచలన అధ్యాయం మొదలుకానుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన యువ సంచలనం, భారత జట్టు తరఫున అరంగేట్రానికి రెడీ అయ్యాడు. ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు తొలి అధికారిక టీమిండియా జెర్సీని అందుకున్న అతడు, జూన్ 26న బెల్ఫాస్ట్‌లో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగితే భారత పురుషుల క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలుస్తాడు.

అయితే అతడి ఎంపిక కంటే ఎక్కువగా చర్చనీయాంశమవుతున్నది అతడు ఎంచుకున్న జెర్సీ నంబర్. భారత మాజీ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఉపయోగించిన ‘03’ నంబర్ జెర్సీని వైభవ్ తనకు ఎంపిక చేసుకున్నాడు. ఈ సంఖ్య క్రికెట్‌తో పాటు ప్రపంచ క్రీడల్లోనూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఫుట్‌బాల్ దిగ్గజాలు పాలో మాల్డిని, రాబర్టో కార్లోస్, బాస్కెట్‌బాల్ స్టార్లు అలెన్ ఐవర్సన్, డ్వేన్ వేడ్, క్రిస్ పాల్ కూడా ఇదే నంబర్‌ను ధరించి తమ ముద్ర వేశారు.

ఎడమచేతి వాటం దూకుడు ఓపెనర్‌గా పేరుగాంచిన వైభవ్ ఇప్పటికే తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలవడంతో పాటు, 2026 ఐపీఎల్ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అదే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా కూడా గుర్తింపు పొందాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన వన్డే ట్రై-సిరీస్ విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ.. “మొదటిసారి బ్యాట్ పట్టుకుని మైదానంలోకి అడుగుపెట్టిన రోజు నుంచి ఈ క్షణం కోసం కలలు కన్నాను. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను” అని వైభవ్ భావోద్వేగంగా పేర్కొన్నాడు.

కాగా భారత క్రికెట్‌లో కొత్తగా వచ్చే ఆటగాళ్లకు జెర్సీ నంబర్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆ నంబర్ ఇప్పటికే వాడుకలో ఉండొద్దు, అంటే ఇప్పుడు టీమిండియా తరఫున ఆడుతున్న ఏ ప్లేయర్ కూడా ఆ నంబర్ ధరించనిదై ఉండాలి, అలాగే ప్రత్యేకంగా రిటైర్ చేయబడిన నంబర్(సచిన్ 10, ధోని 7) కాకూడదు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే అధికారికంగా కేటాయిస్తారు. కాగా హర్భజన్ సింగ్ వారసత్వాన్ని మోసుకెళ్తున్న 03 నంబర్‌ను ఎంచుకున్న వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు తన ఆటతో ఆ సంఖ్యకు కొత్త అర్థం తీసుకురాగలడా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రతిభ, ధైర్యం, వయసు అన్నీ అతడికి అనుకూలంగా ఉండటంతో భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్ దొరికాడనే అభిప్రాయం బలపడుతోంది. రాబోయే సంవత్సరాల్లో ఈ యువ సంచలనం ఎలాంటి చరిత్ర సృష్టిస్తాడో చూడాల్సి ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us