Vaibhav Sooryavanshi : వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఫెయిల్.. ఫ్యాన్స్ ఆశలన్నీ అడియాశలు చేసిన వైభవ్

Vaibhav Sooryavanshi : శ్రీలంక ఏతో జరిగిన కీలక ట్రై సిరీస్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరోసారి నిరాశపరిచాడు. వరుసగా మూడో ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అతని నిలకడలేని ప్రదర్శనపై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది.

Vaibhav Sooryavanshi : వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఫెయిల్.. ఫ్యాన్స్ ఆశలన్నీ అడియాశలు చేసిన వైభవ్
Vaibhav Sooryavanshi (5)

Updated on: Jun 15, 2026 | 12:20 PM

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో తన ధనాధన్ బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించి ఇండియా A జట్టులోకి వచ్చిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత ట్రై సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. శ్రీలంకలో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా శ్రీలంక A తో సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ మరోసారి తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. దీంతో ఈ టోర్నమెంట్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఫ్లాప్ అయి.. ఫెయిల్యూర్స్ హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. వన్డే ఫార్మాట్‌లో క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకోలేక త్వరగానే వికెట్ పారేసుకుంటున్నాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ ఆరంభంలో కాస్త మంచి టచ్‌లోనే కనిపించాడు. లంక బౌలర్లను ఎదుర్కొంటూ తక్కువ బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక అద్భుతమైన సిక్సర్ బాదాడు. అయితే ఈ మెరుపులు ఎక్కువసేపు సాగలేదు. కేవలం 14 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ నాల్గవ ఓవర్లోనే భారత జట్టు తొలి వికెట్ రూపంలో వైభవ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. మంచి ఆరంభం లభించినప్పటికీ దాన్ని భారీ స్కోరుగా మలచడంలో ఈ యువ ప్లేయర్ విఫలమయ్యాడు.

నాలుగో ఓవర్ మొదటి బంతికే ఫోర్ కొట్టిన వైభవ్ మంచి ఊపులో కనిపించాడు. ఆ ఓవర్ నాల్గవ బంతిని డిఫెండ్ చేసినప్పటికీ, ఐదో బంతికి మళ్లీ భారీ షాట్ ఆడాలనే ఆత్రుత ప్రదర్శించాడు. బంతి లైన్ సరిగ్గా అంచనా వేయకుండానే బ్యాట్‌ను గాల్లోకి బలంగా తిప్పేసాడు. దాంతో బంతి బ్యాట్ అంచుకు తగిలి గాల్లోకి లేచింది. అక్కడ సిద్ధంగా ఉన్న లంక ఫీల్డర్ ఎలాంటి తప్పు చేయకుండా క్యాచ్ అందుకోవడంతో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసింది. క్రీజులో కుదురుకోవాల్సిన సమయంలో అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ఈ ట్రై సిరీస్‌లో ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీ ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 79 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో అఫ్గానిస్తాన్‌పై చేసిన 44 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. అతను ఈ సిరీస్‌లో ఎంతగా తడబడుతున్నాడంటే.. మూడు మ్యాచ్‌లు కలిపి మొత్తం కేవలం 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. వన్డే లాంటి సుదీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా వచ్చి పవర్‌ప్లే ముగియక ముందే అవుట్ అవ్వడం టీం ఇండియా మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది.

వైభవ్ సూర్యవంశీ ఆడే శైలి పూర్తిగా టీ20 ఫార్మాట్‌కు సరిపోతుంది కానీ వన్డే మ్యాచ్‌లకు వచ్చేసరికి అతని లిస్ట్-ఎ రికార్డులు అస్సలు బాలేవు. ఇప్పటివరకు అతను ఆడిన 11 లిస్ట్-ఎ వన్డే మ్యాచ్‌లలో కేవలం రెండు సార్లు మాత్రమే యాభై పరుగుల మార్కును దాటగలిగాడు. ఇక నేటి మ్యాచ్‌లో వైభవ్‌తో పాటు మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో టాప్ ఆర్డర్ ఇద్దరూ త్వరగానే అవుట్ అవ్వడంతో భారత యువ జట్టు ఒత్తిడిలో పడింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us