T20 World Cup 2026 : బంగ్లాదేశ్ కోసం వరల్డ్ కప్‌ను త్యాగం చేయనున్న పాక్? ఐసీసీ ప్లాన్-బి అదిరిపోయింది

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక రేంజ్ డ్రామా నడుస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ జట్టు భద్రతా కారణాలతో టోర్నీ నుంచి వైదొలగగా, ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే బాటలో పయనించేలా కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాక్ గనుక టోర్నీని బహిష్కరిస్తే, ఆ స్థానాన్ని భర్తీ చేసే జట్టు ఏదో ఇప్పుడు తేలిపోయింది. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం ఆ అదృష్టం ఉగాండాను వరించబోతోంది.

T20 World Cup 2026 : బంగ్లాదేశ్ కోసం వరల్డ్ కప్‌ను త్యాగం చేయనున్న పాక్? ఐసీసీ ప్లాన్-బి అదిరిపోయింది
Pakistan In T20 Wc 2026

Updated on: Jan 25, 2026 | 10:50 AM

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి మరికొద్ది రోజులే ఉన్న సమయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వైఖరి చర్చనీయాంశంగా మారిపోయింది. ఇప్పటికే బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీ నుంచి వైదొలగడంతో, ఐసీసీ వారి స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. అయితే ఐసీసీ బంగ్లాదేశ్ పట్ల ప్రవర్తించిన తీరుపై పాక్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చినట్లుగానే (హైబ్రిడ్ మోడల్), బంగ్లాదేశ్‌కు కూడా అలాంటి వెసులుబాటు ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా పాక్ కూడా టోర్నీ నుంచి తప్పుకునే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

పాకిస్థాన్ టీమ్ ఈ టోర్నీలో పాల్గొనాలా వద్దా అనే విషయం ప్రస్తుతం ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేతుల్లో ఉంది. ప్రధాని విదేశీ పర్యటన ముగించుకుని రాగానే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను తాము తూచా తప్పకుండా పాటిస్తామని, బాయ్‌కాట్ చేయమంటే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. పాక్ వంటి కీలక జట్టు తప్పుకుంటే ఐసీసీకి వాణిజ్యపరంగా భారీ నష్టం వాటిల్లుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒకవేళ పాకిస్థాన్ అధికారికంగా ఈ టోర్నీ నుంచి తప్పుకుంటే, ఐసీసీ రూల్స్ ప్రకారం క్వాలిఫై కాని జట్లలో అత్యుత్తమ ర్యాంకులో ఉన్న జట్టుకు అవకాశం ఇస్తారు. బంగ్లాదేశ్ తప్పుకున్నప్పుడు స్కాట్లాండ్ ఎలా వచ్చిందో, పాక్ తప్పుకుంటే ఆ ప్లేస్‌లోకి ఉగాండా జట్టు వచ్చే అవకాశం ఉంది. ఉగాండా జట్టు టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉండటమే దీనికి కారణం. ఒకవేళ ఇదే జరిగితే గ్రూప్-ఎ లో భారత్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాతో ఉగాండా తలపడాల్సి ఉంటుంది.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 7న పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో కొలంబోలో ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 15న చిరకాల ప్రత్యర్థి భారత్‌తో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఒకవేళ పాక్ టోర్నీకి రాకపోతే, ఉగాండా జట్టు సరిగ్గా అదే తేదీల్లో ఆయా జట్లతో తలపడుతుంది. అంటే అహ్మదాబాద్‌లోని లక్షా ముప్పై వేల మంది ప్రేక్షకుల ముందు భారత్-పాక్ పోరుకు బదులుగా భారత్-ఉగాండా మ్యాచ్ చూసే పరిస్థితి రావచ్చు. అయితే పాక్ గతంలో కూడా ఇలాంటి బెదిరింపులకు దిగి చివరి నిమిషంలో టోర్నీలలో పాల్గొన్న చరిత్ర ఉంది. కాబట్టి ఈసారి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..