IPL 2026 : ఐపీఎల్‌లో విషాదం.. ముంబై హోటల్ గదిలో బీసీసీఐ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్‌ మృతి

IPL 2026 : బిసిసిఐ (BCCI) కోసం బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బ్రిటన్ పౌరుడు ఇయాన్ విలియమ్స్ లాంగ్‌ఫోర్డ్ మార్చి 24 నుంచి ముంబైలోని ఒక ప్రముఖ హోటల్‌లో ఉంటున్నారు. ఐపీఎల్ ప్రసార విధుల్లో ఉన్న ఈయన హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.

IPL 2026 :  ఐపీఎల్‌లో విషాదం.. ముంబై హోటల్ గదిలో బీసీసీఐ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్‌ మృతి
Ian Williams Langford

Updated on: Mar 31, 2026 | 1:35 PM

IPL 2026 : ఐపీఎల్ 2026 సందడి మధ్య ఒక్కసారిగా విషాదం అలముకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతున్న తరుణంలో, ఐపీఎల్ ప్రసార విధుల్లో ఉన్న ఒక విదేశీ నిపుణుడు హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. బిసిసిఐ (BCCI) కోసం బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బ్రిటన్ పౌరుడు ఇయాన్ విలియమ్స్ లాంగ్‌ఫోర్డ్ మార్చి 24 నుంచి ముంబైలోని ఒక ప్రముఖ హోటల్‌లో ఉంటున్నారు. మార్చి 29న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన తన హోటల్ గదికి (రూమ్ నంబర్ 2715) చేరుకున్నారు. అయితే, మార్చి 30న ఉదయం హోటల్ సిబ్బంది ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. అనుమానం వచ్చిన సిబ్బంది మాస్టర్ కీతో గది తలుపులు తీసి చూడగా, ఇయాన్ నేలపై అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే హోటల్ డాక్టర్‌ను పిలిపించగా, ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

పోలీసుల దర్యాప్తు షురూ

ఈ ఘటనపై ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇయాన్ విలియమ్స్ మరణానికి గల కారణాలు ఏంటి? అది సహజ మరణమా లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. హోటల్ గదిలో లభించిన ఆధారాలను సేకరించడంతో పాటు, సిసిటివి దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. విదేశీ పౌరుడు కావడంతో ఈ విషయాన్ని బ్రిటన్ రాయబార కార్యాలయానికి కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ లాంటి భారీ టోర్నీ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం ప్రసార విభాగం సిబ్బందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

హై స్కోరింగ్ మ్యాచ్ తర్వాత విషాదం

ఇయాన్ విలియమ్స్ చివరిసారిగా విధులు నిర్వహించిన ముంబై ఇండియన్స్ vs కేకేఆర్ మ్యాచ్ అత్యంత హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 219 పరుగుల భారీ స్కోరు సాధించగా, ముంబై ఇండియన్స్ ఆ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. స్టేడియంలో అభిమానులు గెలుపు సంబరాల్లో మునిగి ఉండగా, తెర వెనుక పని చేసే ఒక సాంకేతిక నిపుణుడు ఇలా ప్రాణాలు కోల్పోవడం క్రికెట్ ప్రేమికులను కలచివేస్తోంది.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us