
కరేబియన్ ఐలాండ్ సెయింట్ కిట్స్‌లో జరిగిన మూడో టీ20లో వెస్టిండిస్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఆతిధ్య జట్టుపై టిమ్ డేవిడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 37 బంతుల్లో 11 సిక్సర్లు, 6 ఫోర్లతో అజేయంగా 102 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా మూడవ T20I మ్యాచ్‌లో 23 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో గెలిచింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా T20I సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో, టిమ్ డేవిడ్ తన పేరు మీద అనేక రికార్డులు లిఖించాడు.
ఈ మూడో టీ20లో, టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు జోష్ ఇంగ్లిస్ పేరిట ఉంది. 2024లో స్కాట్లాండ్‌పై 43 బంతుల్లో సెంచరీ చేశాడు జోష్ ఇంగ్లీస్. ఇది కాకుండా, డేవిడ్ ఆస్ట్రేలియా తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని సాధించాడు. కేవలం 16 బంతుల్లోనే ఈ ఘనతను సాధించాడు. గతంలో ఈ రికార్డు మార్కస్ స్టోయినిస్ పేరిట ఉంది. 2022 T20 ప్రపంచకప్‌లో స్టోయినిస్ 17 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. దీనితో పాటు, టిమ్ డేవిడ్ ఒక ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు కొట్టిన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.
TIM DAVID SMASHED A HUNDRED WITH 275.7 STRIKE RATE. 🥶 pic.twitter.com/z9IIvZF5vc
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 26, 2025
వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ మూడు బంతుల ముందుగానే సెంచరీ చేసి ఉన్నట్లయితే, టీం ఇండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టేవాడు. 2017లో శ్రీలంకపై రోహిత్ శర్మ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
తొలి రెండు టీ20 మ్యాచ్‌లలో ఓడిన వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్‌ను ఎలాగైనా గెలవాలని తహతహలాడింది. మొదట బ్యాటింగ్ చేసిన విండిస్ జట్టు కెప్టెన్ షాయ్ హోప్ అద్భుతమైన సెంచరీతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. హోప్ 57 బంతుల్లో 6 సిక్సర్లు, 8 ఫోర్లతో అజేయంగా 102 పరుగులు చేశాడు. అతనితో పాటు, ఓపెనర్ బ్రాండన్ కింగ్ 36 బంతుల్లో 62 పరుగులు చేసి అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. వారిద్దరూ మొదటి వికెట్‌కు 70 బంతుల్లో 125 పరుగులు చేశారు. కానీ టిమ్ డేవిడ్ తుఫాను సెంచరీ.. ఆ ఇద్దరి ఇన్నింగ్స్‌ను డామినేట్ చేసింది. ఆస్ట్రేలియా 16.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి మ్యాచ్‌ను గెలుచుకుంది. టిమ్ డేవిడ్‌తో పాటు మిచెల్ ఓవెన్ 16 బంతుల్లో అజేయంగా 36 పరుగులు చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..